మామియారు వీట్టుక్కు అర్జున్‌ రెడ్డి | This year Kollywood hit the box office collections | Sakshi
Sakshi News home page

మామియారు వీట్టుక్కు అర్జున్‌ రెడ్డి

Published Tue, Feb 5 2019 12:12 AM | Last Updated on Tue, Feb 5 2019 11:13 AM

This year Kollywood hit the box office collections - Sakshi

మామియారు వీట్టుక్కు అంటే.. తమిళంలో అత్తారింటికి అని అర్థం. మరి ఈ ఫిబ్రవరిలో అత్తారింటికి అర్జున్‌ రెడ్డి వస్తాడా? హిట్టు కొడతాడా?ప్రస్తుతం తమిళంలో ఇదే పెరియ కేళ్వి... పెద్ద క్వశ్చన్‌. వారానికి నాలుగు సినిమాల చొప్పున 28 రోజుల్లో 18 సినిమాలు రిలీజవుతున్నాయి ఇదో తమిళ సినిమా ఫెస్టివల్‌ఏ సినిమా ఓడుమ్‌ ఏ సినిమా పోవుమ్‌ తెలియదు.ఏ సినిమా ఆడుతుందో ఏ సినిమా పోతుందో తెలియదు.

‘రిలీజ్‌ డేట్లు పంచుకొని.. కలెక్షన్లు పెంచుకోండి’ అన్నారో ట్రేడ్‌ విశ్లేషకుడు. నిజమే. కానీ ఆ విశ్లేషకుడి మాటలు పూర్తిగా విస్మరించినట్టున్నాం ప్రస్తుతం. సినిమాలో కళ గురించి కాసేపు పక్కన పెట్టి వ్యాపార కోణం నుంచి చూస్తే, నిర్మాత పధ్నాలుగు రీళ్లకు ఖర్చు చేసేది నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే. నాలుగు టికెట్లు ఎక్కువ తెగితే తప్ప జరిగే పని కాదిది. అలా జరగాలంటే నాలుగైదు సినిమాలు ఒకేసారి మార్కెట్లోకి వస్తే కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే తమిళ మార్కెట్‌లో కనిపిస్తోంది. ఫిబ్రవరి క్యాలెండర్‌ చూస్తేనేమో 28 రోజులే.. రిలీజ్‌లు మాత్రం 18 దాకా ఉన్నాయి. మరి థియేటర్స్‌పై ఈ సినిమాల మూకుమ్మడి కుమ్ముడుకి ఫిబ్రవరి కాస్త ఫిబ్రవర్రీ అవుతుందేమో? ఇది కొందరి ఆవేదన.

పైగా సెలవులు ఉండవు కాబట్టి సినిమా రిలీజులకు ఫిబ్రవరిని ‘డ్రై సీజన్‌’గా పరిగణిస్తుంటారు. మరి.. ఫిబ్రవరి తమిళ పరిశ్రమకు ఏం మిగుల్చుతుంది? వేచి చూద్దాం.సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘పేట్టా’, అజిత్‌ ‘విశ్వాసం’ సినిమాల బాక్సాఫీస్‌ క్లాష్‌తో ఈ ఏడాది కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్ల బోణీ కొట్టింది. పొంగల్‌ (సంక్రాంతి)కు విడుదలైన ఈ రెండు సినిమాలు మంచి టాక్‌తో జనవరి చివరివారం దాకా మంచి కలెక్షన్లతోనే కొనసాగాయి. ఇద్దరు స్టార్‌ హీరోలు థియేటర్లు పంచుకున్నప్పటికీ ట్రేడ్‌ని ఆశ్చర్యపరుస్తూ సినిమాలను కొనుగోలు చేసిన అందరూ లాభాలను చూశారు. ఇలాంటి ప్రారంభం చూసి, ఈ ఏడాది మొత్తం ఇలానే ఉండబోతోందని అనుకుంటే అలా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ఫిబ్రవరికి నాలుగు వీకెండ్లున్నాయి. 18 రిలీజులు. ఈ లెక్కన ప్రతీ శుక్రవారం నాలుగు సినిమాలు తగ్గకుండా థియేటర్లోకొస్తాయి. ఆ విధంగా రిలీజ్‌ అయ్యే సినిమాలకు కావాల్సినన్ని స్క్రీన్లు దొరికే విషయంలో కొంత ఇబ్బందే. అవి దాటుకొని థియేటర్స్‌ వరకూ వచ్చిందే అనుకుందాం... మంచి టాక్‌ తెచ్చుకోవాలి. అది మౌత్‌ టాక్‌గా మారి ఆడియన్స్‌లోకి వెళ్లేలోపు ఆ థియేటర్లో వేరే సినిమా పడే అవకాశం ఉంది. ఇలాంటి గందరగోళం ఏర్పడటానికే ఛాన్స్‌ ఎక్కువ. ఫిబ్రవరి మొదటి రోజే  శుక్రవారం కావడంతో పోటీ ఫస్ట్‌ రోజు నుంచే స్టార్ట్‌ అయింది. ఫిబ్రవరి 1న 5 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో.. తెలుగు సూపర్‌ హిట్‌ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్‌గా శింబు నటించిన ‘వందా రాజావాదా వరువేన్‌’, పదేళ్ల తర్వాత మమ్ముట్టి తమిళంలో చేసిన ‘పెరంబు’, జీవి ప్రకాశ్‌ కుమార్‌–రాజీవ్‌ మీనన్‌ల ‘సర్వం తాళమయం’లతో పాటు చిన్న బడ్జెట్‌ సినిమాలు ‘సగా’, పే ఎల్లామ్‌ పావమ్‌’ చిత్రాలు వచ్చాయి.

మొదటి మూడు చిత్రాలు మంచి టాక్‌తో ప్రదర్శితం అవుతున్నా పాజిటివ్‌ టాక్‌ని వసూళ్లుగా ఎలా మార్చుకుంటారో చూడాలి. వచ్చే వారంలో కమెడియన్‌ సంతానం ‘దిల్లుకు దుడ్డు 2’ అనే హారర్‌ కామెడీ చిత్రం ఉంది. ఆ తర్వాత వారం వేలంటైన్స్‌ వీక్‌. నాగ చైతన్య– తమన్నాలతో సుకుమార్‌ రూపొందించిన ‘100% లవ్‌’ను ‘100% కాదల్‌గా’ జీవీ ప్రకాశ్‌ హీరోగా రీమేక్‌ చేశారు. ఈ సినిమాకు సుకుమార్‌ కూడా ఓ నిర్మాత. విక్రమ్‌ తనయుడిని పరిచయం చేస్తూ తెలుగు సూపర్‌ హిట్‌ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాన్ని ‘వర్మ’గా రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. కార్తీ, రకుల్‌ ప్రీత్‌ల ‘దేవ్‌’ కూడా రిలీజ్‌ కానుంది. అలాగే ‘వింక్‌ సెన్సేషన్‌’ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ‘ఒరు అధార్‌ లవ్‌’ తమిళ అనువాద చిత్రం అదే రోజు విడుదల కాబోతోంది.

ఇలా వేలంటైన్స్‌ వీక్‌ కూడా థియేటర్స్‌ ఫుల్‌. ఇవి మాత్రమే కాకుండా ఫిబ్రవరిలో రిలీజ్‌ అని అనౌన్స్‌ చేసిన సినిమాలూ ఉన్నాయి. ‘దాదా 87, కళుగు 2, గొరిల్లా, అయ్యంగరన్, కలవాణి 2, అగ్ని వర్సెస్‌ దేవి, తిరుమానం, బూమరాంగ్, కన్నే కలైమానే, పొదు నలన్‌ కరుది’ సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్‌పై కన్నేశాయి. ఇవే కాకుండా వీలుంటే ఆఖరి నిమిషంలో రిలీజ్‌కు సిద్ధమయ్యే సినిమాలు కొన్ని, పోటీ వద్దనుకుని వెనక్కు వెళ్లే సినిమాలూ మరికొన్ని. ఇలా ఫిబ్రవరి మొత్తం థియేటర్స్‌కు ఫుల్‌ ఫీడింగ్‌ ఉంటుంది.సినిమా చాలా బావుంటేనో, సినిమాలో స్టార్‌ హీరోనో లేకపోతే సాధారణ ప్రేక్షకుడిని థియేటర్స్‌ వరకూ లాక్కురావడం కష్టం. అలా తీసుకొచ్చే ప్రయత్నమే మౌత్‌ టాక్‌ చేస్తుంది. కానీ స్మాల్, మీడియమ్‌ బడ్జెట్‌ చిత్రాలకు టాక్‌ చేరేసరికే ఆ సినిమా థియేట్రికల్‌ రన్‌ ముగుస్తుంది.

మరి ఇన్ని కష్టాల మధ్య కూడా రిస్క్‌ చేసి మరీ రిలీజ్‌ చేయడానికి కారణం? సినిమా నిర్మాణానికి తీసుకున్న వడ్డీ అయినా తగ్గించుకోవచ్చనా? లేక వచ్చే నెల నుంచి పరీక్షలు, ఆ తర్వాత ఐపీఎల్, ఆ తర్వాత ఎన్నికలు. అప్పటికంటే ఈ పోటీనే మేలని ఆలోచించి విడుదల చేస్తున్నారా? లేక  వదిలించుకుంటున్నారా? సాధారణంగా తమిళంలో సినిమా రిలీజ్‌లను ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ చూస్తూ ఉంటుంది. ఏ ఏ సినిమాలు రిలీజ్‌ కావాలో వాళ్లు నిర్ణయిస్తారు. ఒకేరోజు ఎక్కువ సినిమాలకు నిన్న మొన్నటి వరకూ అనుమతి లేదు. కానీ గతేడాది క్రిస్మస్‌ సీజన్‌లో ఈ రూల్‌ని ఎత్తేస్తున్నట్టు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రకటించడంతో డిసెంబర్‌ 21న 5 రిలీజ్‌లు వచ్చాయి.

అదే ఈ నెలలోనూ రిపీట్‌ అవుతోంది. ఏది ఏమైనా అందరూ సేఫ్‌ అవ్వాలంటే కొంచెం గ్యాప్‌ అవసరం. కానీ ఒక్కసారి వాయిదా వేస్తే మళ్లీ మళ్లీ అదే జరుగుతుందనే సెంటిమెంట్‌ అయ్యుండొచ్చు.. ఈ మాత్రం థియేటర్లయినా దొరక్కపోవచ్చనే ఫీలింగ్‌ అయ్యుండొచ్చు.. తాము తీసిన సినిమా మీద బోలెడంత నమ్మకం అయినా అయ్యుండొచ్చు.. కారణం ఏదైనా కావొచ్చు.. ఫిబ్రవరిలో తమిళ స్క్రీన్లు ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. 

తెలుగు 
తమిళంతో పోలిస్తే తెలుగులో అన్ని రిలీజ్‌ల తాకిడి  కనిపించకపోవచ్చు. మొదటి వారం చిన్న బడ్జెట్‌ చిత్రాలు ‘అక్కడొకడుంటాడు, రహస్యం, బిచ్చగాడా మజాకా, సకల కళా వల్లభుడు’  సినిమాలు తెరమీదికొచ్చాయి. ఆ తర్వాతి వారంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ రానుంది. తమిళ అనువాద చిత్రం ‘విచారణ, సీమరాజా, నేనే ముఖ్యమంత్రి, అమావాస్య’ సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

వేలంటైన్స్‌ వీక్‌లో స్ట్రయిట్‌ తెలుగు లవ్‌స్టోరీలు ఏవీ లేకపోయినా,  అనువాద చిత్రాలు కార్తీ ‘దేవ్‌’, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ‘లవర్స్‌ డే’ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతి వారంలో యన్టీఆర్‌ బయోపిక్‌లో సెకండ్‌ పార్ట్‌ ‘యన్టీఆర్‌: మహానాయకుడు’ మరికొన్ని సినిమాలున్నాయి. ఫిబ్రవరి ద్వితీయార్ధం రెండు వారాలు ఖాళీగానే ఉన్నాయి. ఆ స్లాట్‌ని చిన్న బడ్జెట్‌ సినిమాలు హ్యాపీగా ఉపయోగించేసుకోవచ్చు. అయితే డ్రై సీజన్‌ అని వెనక్కి తగ్గినా తగ్గొచ్చు.

మలయాళం 
మలయాళ పరిశ్రమలో కూడా మొదటి రోజు నాలుగు సినిమాలతో ప్రారంభమైంది. మమ్ముట్టి ‘పెరంబు, సర్వం తాళమయం, లోనప్పంటేచ మమోదిసా, అల్లు రమేంద్రన్‌’ సినిమాలతో  ఫస్ట్‌ వీక్‌ ఆరంభమైంది. కానీ తర్వాత వారాల్లో రిలీజ్‌లు చాలా పల్చగా ఉన్నాయి. పృథ్వీరాజ్‌ ‘9’, కులుంబీ నైట్స్, ఒరు అధార్‌ లవ్, జూన్, కొడతి సమక్షం బలన్‌ వకీల్‌’ సినిమాలు మాత్రమే ఫిబ్రవరి రిలీజ్‌కు రెడీ అయ్యాయి. 

కన్నడ 
‘అనుక్తా, మటాష్, అట్టయ వర్సెస్‌ కయోలు, బజార్‌’ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ కూడా ఫిబ్రవరిని నాలుగు రిలీజులతోనే స్టార్ట్‌ చేసింది. ఆ తర్వాతి వారం పునీత్‌రాజ్‌ కుమార్‌ ‘నట సార్వభౌమ’ రిలీజ్‌ కానుంది. ఆ నెక్ట్స్‌ వీక్‌ ‘బెల్‌ బాటమ్‌’ వస్తుంది. ‘రంధావ’ చిత్రం కూడా రిలీజ్‌ అనౌన్స్‌ చేశారు. ఇలా సౌత్‌ ఇండస్ట్రీలన్నింటితో పోలిస్తే తమిళంలోనే ఫిబ్రవరిలో రిలీజ్‌లు ఎక్కువగా ఉన్నాయి.
– గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement