యూత్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు!
‘‘రొమాన్స్’ పెద్దవారిని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదు. కేవలం యువతరం ప్రేక్షకులనే లక్ష్యంగా తీసుకొని తీర్చిదిద్దిన సినిమా’’ అంటున్నారు దర్శకుడు ‘డార్లింగ్’స్వామి. ప్రిన్స్, డింపుల్, మానస ప్రధాన పాత్రధారులుగా మారుతి సమర్పణలో జి.శ్రీనివాసరావు, ఎస్‌కేఎన్ కలిసి నిర్మించిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మరిన్ని విషయాలను చెబుతూ- ‘‘ప్రస్తుతం యువతరం మనోభావాలు ఎలా ఉంటున్నాయి. పెళ్లి విషయం వచ్చే సరికి అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇలాంటి అంశాలనే ప్రధాన నేపథ్యంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. 40 ఏళ్ల వాళ్లకు ఈ సినిమా నచ్చకపోవచ్చు.
యూత్ మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వసూళ్లు బాగున్నాయి. టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు. విజయవంతమైన చిత్రం ద్వారా పరిచయమైనందుకు ఆనందంగా ఉందని కథానాయిక డింపుల్ చెప్పారు. ఇంకా హీరో ప్రిన్స్, సాయి పంపన, సాయికృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.