యుద్ధం.. శరణం
తప్పలేదు... శ్రీకృష్ణుడు అంతటి వ్యూహశాలికి అర్జునుడి చేత యుద్ధం చేయించక తప్పలేదు. న్యాయం కోసం గురువులు, బంధువులు, స్నేహితులపై అర్జునుడు విల్లు ఎక్కు పెట్టక తప్పలేదు. దాంతో మహా భారతంలో అన్నదమ్ముల మధ్య యుద్ధం తప్పలేదు. ఇప్పుడీ నయా భారతంలో నాగచైతన్య కూడా ‘యుద్ధం శరణం’ అంటున్నారు. ఆయన ఎవరిపై విల్లు ఎక్కుపెట్టారనేది వచ్చే నెలలో తెలుస్తుంది.
నాగచైతన్య హీరోగా వారాహి చలనచిత్రం పతాకంపై రజని కొర్రపాటి నిర్మిస్తున్న తాజా సినిమాకు ‘యుద్ధం శరణం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణ ఆర్.వి. మారిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఆదివారం విడుదల చేశారు. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమిది. కథకు తగ్గ టైటిల్ కుదిరింది.
ఇందులో నాగచైతన్య లుక్, యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఆయనతో పాటు రావు రమేశ్, మురళీశర్మ, రేవతిల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 15న టీజర్, తర్వాత ఆడియో విడుదల చేసి, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాని, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్. నాథన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: వివేక్ సాగర్.