సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా యథేచ్ఛగా సాగుతోంది. చెరువులు, వాగులు, వంకలు అనే తేడా లేకుడా విచ్చలవిడిగా రాత్రింబవళ్లు జేసీబీలతో ఇసుకను తవ్వేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రతిరోజూ గుట్టుచప్పుడు కాకుండా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిరోధించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇసుక అక్రమ రవాణా నిరోధించడానికి మండల స్థాయిలో ఉన్న కమిటీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. దీంతో ఇసుక వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతూ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.
జిల్లాలో దాదాపు 500 వాహనాల్లో..
జిల్లాలో భువనగిరి, ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, వలిగొండ, మోత్కూర్, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), మోటకొండూర్ అన్ని మండలాల్లో వందలాది వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీంతో భూగర్భజలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. స్థానిక అవసరాలను సాకుగా చూపెట్టి రాత్రివేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 500 వాహనాలను ఇసుక వ్యాపారానికి వినియోగిస్తున్నారంటే ఇసుక రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఆలేరు మండలంలో..
ఆలేరు మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఆలేరు పెద్దవాగులోని ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. ఈ ప్రాంతం ఏడారిగా మారుతున్నా.. ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదు. అధికారుల అండదండలతో ఇసుకను అడ్డగోలుగా తవ్వి పర్యావరణానికి హానీ కలిగిస్తున్నారు. ఆలేరు శివారులో కొందరు రాత్రివేళల్లో జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. అలాగే గొలనుకొండలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకువచ్చి వ్యవసాయ బావి వద్ద డంప్‌గా ఏర్పాటు చేసి జనగామకు తరలిస్తున్నారు. మండలంలో సుమారు 90 ట్రాక్టర్లను ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతోపాటు బిక్కేరు వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలుతోంది. రాజాపేట మండలంలోని నెమిల, దూదివెంకటాపురం, రఘునాథపురం, పారుపల్లి, పాముకుంట, బేగంపేట, చల్లూరు తదితర గ్రామాల నుంచి ఇసుకు రవాణా చేస్తున్నారు.
యాదగిరిగుట్ట నుంచి..
యాదగిరిగుట్ట పట్టణం, మండలంలోని కొత్తగుండ్లపల్లి, చాకలిగిద్దెతో పాటు మండలంలోని కాచారం పరిధిలోని ధర్మారెడ్డిగూడెం, సైదా పురం పరిధిలోని మైలార్‌గూడెం, దాత్తర్‌పల్లి పరిధిలోని గొల్లగూడెం, మల్లాపురం, చొల్లేరు, జంగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది. మండలంలో ఫిల్టర్ ఇసుక (కృత్రిమ) తయారవుతోంది. యాదాద్రి పుణ్యక్షేత్రం పనులకు ఫిల్టర్ ఇసుకను మండలం నుంచే తరలిస్తున్నారని సమాచారం. మోటకొండూర్ మండలంలోని దిలావర్‌పూర్‌లోని రాత్రివేళలో ట్రాక్టర్‌ల ద్వారా డంప్ చేసి లారీలతో తరలిస్తున్నారు. అమ్మనబోలు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. కాటేపల్లి, చాడ, తేర్యాల, కొండాపూర్ గ్రామాల్లో వాగుల నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా అవుతోంది.
చౌటుప్పల్ మండలంలో ఇలా..
చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లిలో పెద్ద చెరువులో ఉన్న పట్టా భూముల్లో నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పట్టాదారులు ట్రాక్టర్ల యాజమానులకు ఎంతో కొంతకు అమ్ముకుంటున్నారు. ప్రైవేటు భూముల్లో బావులుగా తవ్వి ఇసుకను బయటకు తీసే ఈ వ్యవహారాన్ని అధికారులు అంతగా అరికట్టలేకపోతున్నారు. అంకిరెడ్డిగూడెం శివారులో ఉన్న గోల్డెన్ ఫారెస్టుకు చెందిన భూముల్లో ఉన్న కాల్వ నుంచి కూడా ఇసుక తరలుతోంది.
రామన్నపేట మండలం నుంచి..
రామన్నపేట మండలంలో మూసీ కేంద్రంగా ఇసుక వ్యాపారం మూడు పర్మిట్లు ఆరు ట్రిప్పుల మాదిరిగా జరుగుతోంది. మండంలోని పరిసర గ్రామాలను అనుకుని ప్రవహిస్తున్న మూసీ ఇసుక వ్యాపారులకు వరప్రసాదినిగా మారిందని చెప్పవచ్చు. శోభనాద్రిపురం, లక్ష్మాపురం, పల్లివాడ, సూరారం కేంద్రాలుగా ఇసుక వ్యాపారం సాగుతుంది. పర్మిట్ పొందిన ట్రిప్పుల కంటే ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలించి ఇతరులకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుకను మూసీ నుంచి తరలిస్తున్నట్లు సమాచారం. భువనగిరిఅర్బన్ నుంచి..
మండలంలోని తుక్కాపురం, హన్మాపురం, బస్వాపురం, చీమలకొండూరు, ముస్త్యాలపల్లి, వీరవెల్లి, తాజ్‌పూర్, రాయగిరి గ్రామాల్లో గతంలో అక్రమ ఇసుక రవాణా జరిగేది. ప్రసుత్తం బస్వాపురం, తాజ్‌పూర్, చీమలకొండూరు గ్రామాల్లో రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వలిగొండ మండలం మూసీ పరీవాహక గ్రామాల నుంచి రవాణా అవుతోంది. వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయయని.. ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment