‘ఒక పైసా మాఫీ’
సాక్షి,ఆగ్రాః యూపీలో రైతు రుణమాఫీ ప్రహసనంలా మారింది. రూ 10, రూ 100 చెక్కులు అందుకున్న రైతులు విస్తుపోతుంటే తాజాగా మధురకు చెందిన ఓ రైతు తన రూ 1.5 లక్షల రుణ బకాయిలపై కేవలం ఒక పైసా మాఫీ అవడంతో కంగుతిన్నాడు. మధుర జిల్లాలోని గోవర్ధన్ తహసిల్‌కు చెందిన చిద్ది అనే రైతుకు ఆరేళ్ల కిందట కిసాన్ క్రెడిట్ ద్వారా రూ లక్షన్నర పంట రుణం తీసుకున్నాడు. అతనికి కేవలం 5 బిఘాల భూమి మాత్రమే ఉంది. జిల్లా అధికారులు చిద్దికి ఇచ్చిన సర్టిఫికెట్‌లో అతను చెల్లించాల్సిన రుణంలో కేవలం ఒక పైసా మాఫీ అయినట్టుగా ఉంది. దీనిపై సదరు రైతు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఇది బ్యాంక్ అధికారుల తప్పిదమా లేక ఒక పైసానే మాఫీ అయిందా అనేది అర్థం కావడం లేదని వాపోయారు. రైతులతో అధికారులు చెలగాటమాడుతున్నారని చిద్ది అన్నారు. మరోవైపు ఇదే తరహా లోన్ తీసుకున్న ఇతరులకు పూర్తి మొత్తం మాఫీ అయిందని చెప్పారు. అధికారులకు లంచాలు ఇవ్వని రైతులకే తమ లాంటి పరిస్థితి ఎదురైందని చిద్ది, అతని కుమారుడు ఆరోపించారు. అయితే సాంకేతిక కారణాలతోనే తప్పులు దొర్లాయని మధుర జిల్లా మేజిస్ర్టేట్ అరవింద్ మల్లప్ప వివరణ ఇచ్చారు. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ అనుసంధానం చేసిన రైతులకు తొలి దశలో రుణ మాఫీ వర్తింపచేశామని తెలిపారు.సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే మలివిడతలో చిద్ది రుణం మాఫీ అవుతుందని ఆయన హామీ ఇచ్చారు.