
గంగానదిలో 100 మృతదేహాలు
- సర్వత్రా కలవరం; సమాచారం కోరిన కేంద్రం
- వున్నావ్ జిల్లాలో రెండు రోజుల్లోనే 104 మృతదేహాలు వెలికితీత
- పరియార్ ఘాట్ వద్ద నీటి మట్టం తగ్గటంతో బయటపడ్డ శవాలు
లక్నో/వున్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని గంగానదిలో గత రెండు రోజుల్లోనే వందకు పైగా మృతదేహాలు బయటపడ్డాయి. వున్నావ్ జిల్లా సఫీపూర్ ప్రాంతంలోని పరియార్ ఘాట్ సమీపంలో మంగళవారం నాడు 30 మృతదేహాలను స్థానిక అధికారులు వెలికితీయగా.. బుధవారం నాడు మరో 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సౌమ్యా అగర్వాల్ తెలిపారు. మొత్తం 104 వరకూ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
45 గ్రామాల నుంచి వివరాల సేకరణ...
మృతదేహాల వెలికితీత ఉదంతంపై పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని రాష్ట్ర డీజీపీ ఎ.కె.గుప్తా ఆదేశించారు. మృతదేహాల్లో చాలావరకూ పురుషులో, స్త్రీలో గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయని, వీటికి శవపరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో డీఎన్‌ఏ పరీక్షల కోసం 80 మృతదేహాల నుంచి నమూనాలు సేకరించారు. మిగతా మృతదేహాలు మరింత తీవ్రంగా దెబ్బతిని ఉండటం వల్ల వాటి నుంచి డీఎన్‌ఏ నమూనాలు తీసుకోవటం సాధ్యం కాలేదని ఐజీ ఎ.సతీష్‌గణేష్ తెలిపారు. ఈ మృతదేహాలు అవివాహిత యువతులు, చిన్నపిల్లలవి కావచ్చునని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా మృతదేహాలను ఖననం చేసే పరియార్ ఘాట్ వద్ద నీటి మట్టం తగ్గిపోవటంతో ఈ మృతదేహాలు బయటపడ్డాయని చెప్పారు. అవివాహితులు, చిన్నపిల్లలు మృతి చెందినపుడు వారి మృతదేహాలను బంధువులు ఖననం చేయకుండా గంగానదిలో విడిచిపెడుతుంటారని స్థానికులు వివరించినట్లు ఆయన చెప్పారు. వున్నావ్ చుట్టుపక్కల పరియార్ ఘాట్ వద్ద మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే 45 గ్రామాలను గుర్తించామని, గత ఏడాది కాలంలో ఆయా గ్రామాల్లో చనిపోయిన, మృతదేహాలకు పరియార్ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబాల వివరాలివ్వాల్సిందిగా గ్రామ పెద్దలను కోరామని వివరించారు. ఆ వివరాలు అందగానే.. సదరు కుటుంబాల డీఎన్‌ఏ నమూనాలతో.. నదిలో లభ్యమైన మృతదేహాల డీఎన్‌ఏ నమూనాలతోపోల్చి తనిఖీ చేస్తామని చెప్పారు.
సామూహిక ఖననానికి నిర్ణయం...
మృతదేహాలు పూర్తిగా దెబ్బతిని ఉండటంతో వాటిని వెలికి తీసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది నిరాకరిస్తున్నారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాలను వెలికితీసేందుకు జేసీబీలను వినియోగించటంపై స్థానికులు, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళవారం రాత్రి ఘటనా ప్రాంతాన్ని సందర్శించి.. వెలికితీసిన మృతదేహాలను తగిన రీతిలో ఖననం చేయాలని, ఈ మొత్తం ఉదంతంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలన్నారు.
బృందాన్ని రప్పిస్తున్నాం: ఉమాభారతి
గంగానదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడటంపై వాస్తవాలను తెలుసుకునేందుకు కేంద్ర అధికారుల బృందాన్ని పంపించాలని తమ శాఖ కార్యదర్శికి నిర్దేశించినట్లు కేంద్ర జల వనరులు, గంగా ప్రక్షాళన శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. కాన్పూర్ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతున్నందున.. గంగానదిలో నీటి ప్రవాహం తగ్గిందని, దీంతో అనేక మృతదేహాలు నీటిపై తేలుతూ బయటపడ్డాయని ఉమాభారతి పేర్కొన్నారు.