100మంది రాహుల్గాంధీలొచ్చినా..
ముంబై : ఎన్డీయే ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కారు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవహేళన చేయడంపై శివసేన మండిపడింది. తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో రాహుల్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించింది. 56 రోజుల సుదీర్ఘ సెలవు తర్వాత రంగంలోకి వచ్చిన రాహుల్ కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఉత్సాహంగా ఉన్నారనీ అయితే మోదీ హవా ముందు ఈ ఉత్సాహం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేమంటూ ఎద్దేవా చేసింది.
ప్రధానమంత్రి మోదీకి రాహుల్ ఏ మాత్రం సాటిరాడని పేర్కొంది. 100 మంది రాహుల్ గాంధీలొచ్చినా.... మోదీ హవా ముందు కొట్టుకుపోతారని వ్యాఖ్యానించింది. కోల్గేట్, స్పెక్ట్రమ్ కుంభకోణాలతో నగదు సూట్ కేసులను మార్చుకున్నచరిత్ర కాంగ్రెస్ పార్టీదంటూ చురకలు వేసింది. ప్రపంచ వ్యాప్తంగా మోదీ విశ్వాసాన్ని నింపారని సామ్నా పేర్కొంది. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న ప్రధాని పట్ల.. దేశంలోని వ్యాపారం రంగం నమ్మకంగానూ, గర్వంగాను ఉందని కొనియాడింది.
కాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శలపై స్పందించిన ప్రధాని మోదీ సూట్‌కేసుల సర్కారు కన్నా సూటు బూటు సర్కారు ఎంతో మేలని, కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని ఎత్తిచూపుతూ ప్రధాని గట్టిగా చురక వేసిన సంగతి తెలిసిందే.