
అమ్మ చెప్పిందని టీచర్‌ను పొడిచేసేందుకు..!
రామనాథపురం: అమ్మ చెప్పిందని ఓ 11 ఏళ్ల బాలిక టీచర్‌ను బాకుతో పొడిచేందుకు ప్రయత్నించిన ఘటన తమిళనాడులో జరిగింది. దక్షిణ తమిళనాడులోని రామనాథపురంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం టీచర్‌కు చెప్పకుండా క్లాస్ మధ్యలోనే వెళ్లిపోయింది. దీంతో ఉపాధ్యాయురాలు తిడుతుందేమోనన్న భయంతో శనివారం బడికి వచ్చేటప్పుడు తల్లిని వెంటబెట్టుకొని వచ్చింది. టీచర్ ఇద్దరిని వెళ్లి ప్రధాన ఉపాధ్యాయుడిని కలిసి అనుమతి తెచ్చుకోవాలని సూచించింది. దీంతో టీచర్‌కి, విద్యార్థిని తల్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ టీచర్‌ను పొడిచేయమంటూ కూతురికి చెప్పింది.
వెంటనే ఆ చిన్నారి ఒక బాకు తీసుకొని టీచర్‌ను పొడిచేందుకు పూనుకుంది. భయభ్రాంతురాలైన టీచర్ వెంటనే అల్లారం మోగించి.. ప్రధాన ఉపాధ్యాయుడికి ఈ విషయం తెలియజేసింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. టీచర్‌పై దాడికి ప్రయత్నించిన తల్లీకూతుళ్లను పోలీసులు కాసేపు ప్రశ్నించి వదిలేశారు. అయితే తన కూతురిని టీచర్ తరచూ వేధిస్తున్నదని, తమను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నదని విద్యార్థిని తల్లి ఆరోపించింది. టీచర్ నుంచి భద్రత కోసమే తన కూతురు బాకును చేతిలో పట్టుకుందని ఆమె చెప్పుకొచ్చింది.