తమిళనాడు, టీ.నగర్: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయురాలిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి యత్నించిన ఘటనను ఖండిస్తూ కొండ గ్రామస్తులు గురువారం పోలీసు స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. తిరుచ్చి జిల్లా తురైయూర్ యూనియన్ కోంబై గ్రామ పంచాయతీ పరిధిలోని అడవి ప్రాంతంలో మరుదై కొండ గ్రామం ఉంది. ఇక్కడ ఆదిద్రవిడ, గిరిజన సంక్షేమ శాఖ తరపున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో 26 ఏళ్ల వయస్సున్న ఉపాధ్యాయురాలు పని చేస్తున్నారు. ఈ కొండ గ్రామానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో దట్టమైన అడవి ప్రాంతంలో రెండు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంది. ఈ స్థితిలో గత 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత ఉపాధ్యాయురాలు అడవి మార్గంలో ఇంటికి బయలుదేరారు.
మార్గం మధ్యలో కొండ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు అక్కడికి వచ్చారు. టీచర్‌ను అడ్డుకుని ఆమెపై అత్యాచారం చేయడానికి తీవ్రంగా యత్నించాడు. దీంతో ఆమె బాలుడి చెర నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ తిరిగి గ్రామానికి చేరుకుంది. అక్కడ గ్రామస్తుల వద్ద విషయాన్ని తెలిపి విలపించింది. వెంటనే గ్రామస్తులు ఆ విషయాన్ని తురైయూర్ పోలీసులకు, ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ అధికారి రంగరాజన్‌కు సమాచారం ఇచ్చారు. అందిన సమాచారం మేరకు తర్వాత రోజు రంగరాజన్ సంబంధిత కొండ గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. ఇదిలా ఉండగా పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి సదరు విద్యార్థి, ఉపాధ్యాయురాలి వద్ద మాట్లాడి సర్ది చెప్పి పంపించారు.
ఈ విషయం తెలుసుకున్న కొండ గ్రామ ప్రజలు వంద మందికి పైగా గురువారం రాత్రి తురైయూర్ పోలీసు స్టేషన్‌ను ముట్టడించి ఆ బాలుడిని అరెస్టు చేయాలని ఆ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, కొండ గ్రామ మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment