బాలుడిపై పైశాచికం
న్యూఢిల్లీ: 14 ఏళ్ల దళిత బాలుడిని కొందరు బట్టలు ఊడదీసి, దుర్భాషలాడుతూ కొట్టడమే కాకుండా అతనిపై మూత్ర విసర్జన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలోని పిల్‌ఖానా గ్రామంలో చోటుచేసుకుంది. దళితుల సమస్యలపై మాట్లాడేందుకు రాజ్యసభలో తనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ చీఫ్ మాయావతి తన సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాతి రోజే ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.
8 మంది బాలురు తన చేతులను కట్టేసి దుస్తులు తొలగించారని బాధిత బాలుడు ఆరోపించాడు. తనను వదిలిపెట్టమని ఎంతగా ప్రాధేయపడినా వారు కనికరించకుండా కొట్టారని, చివరకు తనపై మూత్ర విసర్జన చేసి విడిచిపెట్టారని గోడు చెప్పుకున్నాడు. తనను దుర్భాషలాడుతూ దళితుడినని పదేపదే హేళన చేశారని, వారిలో ఒకడు ఈ తతంగాన్ని అంతా వీడియో తీశాడని చెప్పాడు. నిందితులందరినీ అరెస్ట్ చేశామని అలీగఢ్ ఎస్పీ రాజేశ్ పాండే తెలిపారు.