‘కాన్పూర్ రైలు’ మృతులు 146
- 83 మందికి కొనసాగుతున్న చికిత్స
- ప్రమాదంపై రైల్వే విచారణ షురూ
- వేగంగా పాత బోగీల తొలగింపు: మంత్రి సురేశ్ ప్రభు
పుఖ్రాయా(యూపీ): ఇండోర్-పట్నా రైలు ప్రమాద మృతుల సంఖ్య సోమవారం 146కు పెరిగిందని కాన్పూర్ రేంజ్ ఐజీ జకీ అహ్మద్ చెప్పారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 79 మంది పరిస్థతి విషమంగా ఉందని తెలిపారు. కాన్పూరు సమీపంలో పట్టాలు తప్పిన 14 రైలు బోగీలను తొలగించారు. సుమారు 133 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు కాన్పూర్ ముఖ్య ఆరోగ్యాధికారి రామాయణ్ ప్రసాద్ వెల్లడించారు. 24 శరీరాలను బిహార్‌కు, 25 మధ్యప్రదేశ్‌కు, 56 మృతదేహాలను ఉత్తరప్రదేశ్‌కు పంపినట్లు చెప్పారు. గాయపడిన 202 మందిలో 83 మందికి కాన్పూర్‌లో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. రైలు ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు రైల్వే భద్రతా కమిషనర్(తూర్పు సర్కిల్) పీకే ఆచార్య నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. సోమవారం ఆయన ప్రమాదం జరిగిన చోటును సందర్శించి విరిగిన పట్టాలు, దెబ్బతిన్న బోగీలను పరిశీలించి వీడియో తీశారు.
బాధ్యులకు కఠిన శిక్ష : సురేశ్ ప్రభు
కాన్పూర్ సమీపంలో ఆదివారం రైలు ప్రమాదానికి కారకులైన వారికి కఠిన శిక్ష తప్పదని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హెచ్చరించారు. ఈ దుర్ఘటనపై అధునాతన సాంకేతికత, ఫోరెన్సిక్ విశ్లేషణల సాయంతో ప్రత్యేకంగా విచారణ జరిపిస్తామని ఆయన సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. గత రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లుగా ప్రమాదాలను తట్టుకోలేని పాత బోగీలను తొలగించే ప్రక్రియను త్వరితగతిన చేపడతామని చెప్పారు.
సహాయ మంత్రి ప్రకటనపై రాజ్యసభలో అభ్యంతరం
రైలు ప్రమాదంపై రాజ్యసభలో రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెరుున్ ప్రకటన చేయగా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారుు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుయే దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేశారుు. గొహెరుున్ కేబినెట్ మంత్రి కారని, లోక్‌సభలో రైల్వే మంత్రి ప్రకటన చేసి రాజ్యసభకు సమాధానం ఇవ్వకపోవడం సభను అగౌరవపరచడమేనని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ విమర్శించారు.
కుటుంబాన్ని కాపాడిన చేతి కర్ర
ఇండోర్-పట్నా రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఓ వృద్ధురాలి చేతికర్ర కుటుంబంలోని ఏడుగురిని కాపాడింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ చౌరాసియా కుటుంబం పట్నాకు బయల్దేరుతూ ఇండోర్‌లో రెలైక్కింది. ప్రమాదం జరిగిన తరువాత తామంతా బీఎస్1 బోగీలో చిక్కుకున్నామని తన తల్లి చేతికర్రే తమను కాపాడిందని చౌరాసియా చెప్పారు. ఆ కర్ర సాయంతో కిటికీ తలుపులు పగలగొట్టి గంట తరువాత సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. తమ బోగీలోని సహాయకుడు, మరి కొందరు ప్రయాణికులు చనిపోగా మృత్యువు తమకు అతి సమీపం నుంచి వెళ్లిందని చౌరాసియా భార్య నందిని చెప్పారు.