రైలు ప్రమాదం: బీమా అందేది ఎందరికి? | most of the uttarpradesh train accident victims may face difficulty in getting insurance | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదం: బీమా అందేది ఎందరికి?

Published Mon, Nov 21 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

రైలు ప్రమాదం: బీమా అందేది ఎందరికి?

రైలు ప్రమాదం: బీమా అందేది ఎందరికి?

ఇండోర్- పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మరణించిన వారి వారసుల్లో చాలామందికి రైల్వేశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన బీమా పథకంలో సొమ్ము అందే అవకాశాలు కష్టమని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 145 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే శాఖ ఇటీవల చేపట్టిన పథకంలో భాగంగా.. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే 92 పైసల ప్రీమియం కడితే.. ప్రయాణంలో ఏదైనా ప్రమాదం సంభవించి ప్రయాణికుడు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా వాళ్ల వారసులకు రూ. 10 లక్షల మొత్తం బీమా రూపంలో అందుతుంది. అయితే.. ఇందుకోసం ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నామినీ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవాలి. టికెట్ బుక్ చేసుకున్న వెంటనే తాము చాలాసార్లు ఈమెయిల్స్, ఎస్ఎంఎస్‌లు పంపుతామని.. అయినా కూడా దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోకుండా నామినేషన్ విషయాన్ని చాలామంది పట్టించుకలేదని శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి జగన్నాథన్ అన్నామలై చెప్పారు. బీమా క్లెయిమ్ విషయంలో నామినీ లేనప్పుడు బీమా సంస్థలు 'లీగల్ హెయిర్ సర్టిఫికెట్' అడుగుతాయి. దాన్ని స్థానిక ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు చాలా తతంగమే ఉంటుంది. కేవలం 92 పైసల ప్రీమియం కడుతుండటంతో చాలామంది నామినీ పేరు రాయాలన్న విషయాన్ని పట్టించుకోరని.. అదే ఇప్పుడు క్లెయిములు సెటిల్ చేయడంలో పెద్ద అడ్డంకి అవుతుందని చెప్పారు. పైగా, ఈ రైల్వే బీమా విషయంలో ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లోగానే క్లెయిమ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లెయిమ్‌కు వెళ్లినా ప్రయోజనం ఉండదు. (92 పైసలకే రూ.10 లక్షల బీమా)
 
ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 695 మంది ప్రయాణికులు రిజర్వేషన్ కంపార్టుమెంట్లలో ప్రయాణిస్తున్నారని భారతీయ రైల్వేల సీపీఆర్వో అనిల్ సక్సేనా తెలిపారు. వాళ్లలో కేవలం 128 మంది మాత్రమే టికెట్ బుకింగ్ సమయంలో బీమా కావాలని, దాని ప్రీమియం కట్టారు. వారిలో 78 మంది ప్రమాద సమయానికి రైల్లోనే ఉన్నారు. మిగిలిన వారు తర్వాత స్టేషన్లలో ఎక్కాల్సి ఉంది. అయితే.. మృతుల్లో ఇలా బీమా ప్రీమియం కట్టినవాళ్లు ఎంతమంది అనే విషయం కూడా ఇంకా లెక్కతీయాల్సి ఉంది. (రైలు టికెట్‌తోపాటే బీమా.. అనూహ్య స్పందన)
 
అయితే.. నామినీ లేనంత మాత్రాన బీమా కంపెనీలు వారసులకు డబ్బు ఇవ్వబోమంటే ప్రభుత్వం ఒప్పుకొనే పరిస్థితి ఉండదు. ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకుని ప్రీమియం కట్టినవారిలో మృతులుంటే వారందరికీ వీలైనంత త్వరలోనే బీమా సొమ్ము ఇప్పించే ప్రయత్నం చేస్తారు. నామినీ పేరు రాయని వాళ్లకు కొంత ఆలస్యం కావచ్చు గానీ.. అసలు అందకపోయే ప్రసక్తి ఉండదని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారులు చెప్పారు. ఇక నుంచి ప్రమాద బీమాను ఐచ్ఛికం కాకుండా తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అలాగే, బీమా ప్రీమియం కడుతున్నప్పుడే నామినీ పేరు కూడా రాయించాలని చెబుతున్నారు. 92 పైసలు ప్రీమియం కట్టిన తర్వాత.. ప్రయాణంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ. 10 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ. 7.5 లక్షలు, ఆస్పత్రి పాలైతే రూ. 2 లక్షలు, మృతదేహం తరలింపు ఖర్చుల కింద రూ. 10వేలు చెల్లిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement