ఈ రైలు ప్రమాదానికి ఎవరు బాధ్యులు? | where is the train safty | Sakshi
Sakshi News home page

ఈ రైలు ప్రమాదానికి ఎవరు బాధ్యులు?

Published Mon, Nov 21 2016 6:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

ఈ రైలు ప్రమాదానికి ఎవరు బాధ్యులు?

ఈ రైలు ప్రమాదానికి ఎవరు బాధ్యులు?

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్‌రైలు ప్రమాదంలో దాదాపు 145 మంది ప్రయాణికులు మరణించడానికి కారణం ఏమిటీ? అందుకు బాధ్యులెవరు? రైలు పట్టాలపై పగుళ్లు ఏర్పడడం వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రైలు పట్టాల నిర్వహణ బాధ్యత చూస్తున్న రైల్వే భద్రతా విభాగం ఏం చేస్తుంది? గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను ప్రవేశపెడతామని కేంద్ర రైల్వే శాఖ ఘనంగా చెబుతోంది. అవి కూడా ఈ పట్టాలపై నుంచే దూసుకుపోతే జరగబోయే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో ఉన్నతాధికారులు ఊహించలేరా?

గత మూడేళ్ల కాలంలో .జరిగిన రైలు ప్రమాదాల్లో 50 శాతం ప్రమాదాలు పట్టాలు తప్పడం వల్లనే జరిగాయి. వాటిలో 29 శాతం ప్రమాదాలు పట్టాలపై పగుళ్లు ఏర్పడడం కార ణంగానే జరిగాయి. ఈ ఒక్క ఏడాదే, అంటే నవంబర్ 15వ తేదీ వరకు సంభవించిన మొత్తం రైలు ప్రమాదాల్లో 67 శాతం ప్రమాదాలు పట్టాలు తప్పడం వల్ల జరిగాయి. రైలు పట్టాలు సవ్యంగా ఉన్నాయా, లేవా అన్నది ఎప్పటికప్పుడు తనీఖీ చేయాల్సిన బాధ్యత ‘ట్రాక్ సేఫ్టీ’ విభాగానిది. పట్టాలను తనిఖీ చేస్తూ వెళ్లి రైల్వే ఉద్యోగులను ‘గ్యాంగ్‌మెన్’ అని పిలుస్తారని తెల్సిందే.

15 కిలోల బరువుతో ఐదు కిలోమీటర్లు

ఒక్కో గ్యాంగ్‌మేన్ రోజుకు ఐదు కిలోమీటర్లు కాలి నడకన వెళ్లి పట్టాలను తనిఖీ చేయాలి. తనిఖీకి అవసరమైన పరికరాలు 15 కిలోల బరువు ఉంటాయి. వాటిన భుజాన స్వయంగా మోసుకొని వెళ్లాలి. మరమ్మతు చేయడం తన వల్లయితే చేయాలి. లేదంటూ సంబంధిత ఇంజనీరును అలెర్ట్ చేయాలి. ఇలా దేశంలోని 11,5,000 కిలోమీటర్ల రైలు పట్టాలను గ్యాంగ్‌మెన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంటుంది. రైల్వే శాఖలో ప్రస్తుతం రెండు లక్షల మంది గ్యాంగ్‌మెన్ ఉన్నారు. లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వీటిని నింపేందుకు రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గ్యాంగ్‌మేన్‌ల బరువును తగ్గించే ఆధునిక పరికరాలను తెప్పించడం లేదు.

ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తున్న పరికరాలకే గ్యాంగ్‌మెన్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ‘అల్ట్రాసోనిక్  ఫ్లా డిటెక్షన్ మిషన్లు’ వాడుతున్నారుగానీ, వాటిని కూడా గ్యాంగ్‌మెన్లే మోసుకెళ్లాలి. వీటిని రెండు నెలలకు ఓసారి మాత్రమే రద్దీ ఎక్కువగా ఉన్న ట్రాక్‌లపై ఉపయోగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి డ్యూటీ పట్టాలపైనే. అత్యవసర సమయాల్లో ఎప్పుడుపడితే అప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. వారి వల్ల ఎక్కువ ఒత్తిడి ఉండడం కూడా కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతోంది. ఎక్కువ రైళ్లు వెళ్లడం, అందులో ఎక్కువ బరువుగల రైళ్లు వెళ్లడం వల్ల పట్టాల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయని ‘ఇండియన్ రైల్వేస్ లోకో రన్నింగేమేన్ ఆర్గనైజేషన్’కు చెందిన ఆఫీస్ బేరర్ సంజయ్ పాంఢీ తెలిపారు. రైలు పట్టాలపై పగుళ్లను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం మద్రాస్ ఐఐటీతో రైల్వే శాఖ కలసి కృషి చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రాలేదు.

ట్రాక్‌ను పర్యవేక్షించే సాఫ్ట్‌వేర్ ఏమైంది?

ట్రాక్‌ను పర్యవే క్షించే సాఫ్ట్‌వేర్ వ్యవస్థను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ ఏడాది మొదట్లో ప్రవేశపెట్టారు. అయితే రైల్వే భద్రతా విభాగానికి ప్రధానంగా అందుబాటులో ఉండాల్సిన ఈ వ్యవస్థ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, దాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో అర్థం కావడం లేదని ఆ విభాగానికి చెందిన పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రైళ్లు వెళ్లినప్పుడు పట్టాలపై ఏర్పడే చిన్న చిన్న పగుళ్లు ఆ తర్వాత ఓ రోజులో ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువ, తక్కువ వ్యత్యాసాలు ఉన్నప్పుడు, సంకోచ, వ్యాకోచాల కారణంగా పెద్దగా  మారుతాయి.

కొన్ని సార్లు పట్టాల నట్లు గట్టిగా భిగించినప్పుడు లేదా రైలు ట్రాక్‌లను మార్చినప్పుడు కూడా ఇలాంటి పగుళ్లు ఏర్పడుతాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సరైన వ్యవస్థ, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసే ఆధునిక పరికరాలు లేకపోతే పట్టాలు తప్పే ప్రమాదాలు ఎప్పటికీ ఆగిపోవు. భారత పట్టాలపై బుల్లెట్ రైళ్లను పరుగెత్తించాలని వాంఛిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టాల భద్రతకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement