ఘోర రైలు ప్రమాదం
యూపీలో రైలు ప్రమాదంలో 120 మందికిపైగా మృతి
- కాన్పూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘటన
- పట్టాలు తప్పిన ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్‌లోని 14 బోగీలు
- 200 మందికి పైగా తీవ్రమైన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
- ప్రమాదానికి 9 నిమిషాల ముందు అదే ట్రాక్‌లో ప్రయాణించిన సబర్మతీ ఎక్స్‌ప్రెస్
యూపీ రైలు ప్రమాదం ప్రయాణికులను ఓ కుదుపు కుదిపింది. ఆదమరిచి నిద్రిస్తున్న వారిని శాశ్వత నిద్రలోకి నెట్టేసింది. చిమ్మ చీకట్లో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాల్లో చీకటి నింపింది. అప్పటి వరకు పక్కనే నిద్రిస్తున్నవారి జాడ దొరకని పరిస్థితి. నుజ్జునుజ్జరుున బోగీల్లో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు.. పెళ్లి కోసం ఒకరు.. పెళ్లి పనుల కోసం మరొకరు.. తమవారి కోసం రైలు, ఆసుపత్రుల వద్ద వెతుకులాట కంటతడి పెట్టిస్తుంటే.. చావును దగ్గర్నుంచి చూశామని ఒకరు.. ఇలాంటి ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదని మరొకరు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదగాథ. గ్యాస్ కట్టర్లతో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, రైల్వే బలగాలు తీవ్రంగా ప్రయత్నించి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది.
పుఖ్రయా (కాన్పూర్): ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బయలుదేరిన ‘ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్’ కాన్పూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 120 మందికి పైగా మృత్యువాత పడగా.. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. అక్కడక్కడ తెగిపడిన శరీర భాగాలతో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు స్థానికులను, మృతుల బంధువులను కన్నీరు పెట్టించారుు. ప్రమాదం సంగతి తెలియగానే రైల్వే, యూపీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనా స్థలంలో..
ప్రమాదం గురించి తెలియగానే రైల్వే శాఖ, యూపీ ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగారుు. కేంద్రం 5 ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. చిమ్మచీకట్లో ఘటన జరగటంతో సహాయక కార్యక్రమాలు కాస్త ఆలస్యమయ్యారుు. తెల్లవారిన తర్వాత గ్యాస్ కట్టర్ల సాయంతో బోగీలను కోసి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. ఆర్మీ డాక్టర్లు, రైల్వే అధికారులు యూపీ ప్రభుత్వ వైద్యులు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సచేసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సాయంత్రం వరకు 120 మృతదేహాలను బోగీలనుంచి బయటకు తీసినట్లు కాన్పూర్ రేంజ్ ఐజీ జాకీ అహ్మద్ తెలిపారు. ఇందులో కేవలం 43 మందిని మాత్రమే గుర్తించగలిగారు. ఇందులో 27 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. మృతుల్లో బిహార్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రభు నారాయణ్ సింగ్, అనిల్ కిషోర్, యూపీ పోలీసు కానిస్టేబుల్ లఖన్ సింగ్ ఉన్నారు. ఎస్1, ఎస్2 బోగీల్లోని టికెట్ కలెక్టర్ల ఆచూకీ లభించలేదు. క్షతగాత్రులను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ పరామర్శించారు. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా (పీఎంఆర్‌ఎఫ్ నుంచి) ప్రకటించారు. అటు సురేశ్ ప్రభు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ తరపున మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూపీ సీఎం అఖిలేశ్ కుమార్ కూడా మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు.
గుర్తుపట్టలేనంతగా: ఎన్డీఆర్‌ఎఫ్
ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు 56 మందిని ప్రాణాలతో కాపాడగలిగారుు. ఇద్దరు చిన్నారులుసహా మొత్తం 16 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, రెండు బోగీలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోవటంతో చాలావరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెల్లడించారుు. ఇప్పటివరకు క్షతగాత్రులందరిని బయటకు తీసుకొచ్చామని.. లోపల ఉండే వారు బతికే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. కోల్డ్ కట్టర్ల సాయంతో బోగీలను కట్ చేస్తున్నట్లు తెలిపారు.
చావును దగ్గర్నుంచి చూశాం
యూపీ రైలు దుర్ఘటననుంచి ప్రాణాలు కాపాడుకున్నవారు ఇంకా భయంతో వణికిపోతున్నారు. చావును దగ్గర్నుంచి చూశామని బాధితులు తెలిపారు. ‘మంచి నిద్రలో ఉన్నాం ఒక్కసారిగా భయంకరమైన కుదుపునకు సీట్లలోనుంచి కిందపడ్డాం. అంతలోనే భయంకరమైన శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే హాహాకారాలు, ఆర్తనాదాలు మొదలయ్యారుు. అతికష్టం మీద బోగీల్లోనుంచి బయటకొచ్చాం’ అని క్షతగాత్రుడొకరు తెలిపారు. ‘మా జీవితంలో ఇంతటి ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదు. మావాళ్లు ఐదుగురి కోసం ఇంకా వెతుకుతున్నాం’ అని దీపికా త్రిపాఠి అనే ప్రయాణికురాలు తెలిపారు. ‘మాకు స్వల్ప గాయాలయ్యారుు. పట్టాలు తప్పిన బోగీలనుంచి బయటకు రావటం చాలా కష్టమైంది. టారుులెట్ ద్వారం గుండా బయటకు వచ్చాం’ అని మరో ప్రయాణికుడు తెలిపారు. ప్రమాదానికి గురైన నాలుగు బోగీల్లోని తమవారి ఆచూకీ కోసం ఘటనా స్థలం, ఆసుపత్రుల వద్ద బంధువులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఎల్‌హెచ్‌బీ ఉండుంటే..
రైలు బోగీలు ‘లింక్ హాఫ్‌మాన్ బుష్’ (ఎల్‌హెచ్‌బీ)తో తయారుచేసినవి కాకపోవటం వల్లే దుర్ఘటన తీవ్రత ఎక్కువగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. స్టెరుున్ లెస్ స్టీల్‌తో తయారైన ఈ ఎల్‌హెచ్‌బీ బోగీలు షాక్‌ను అబ్జార్బ్ చేసుకుని బోగీలు ఒకదానికొకటి ఢీ కొనకుండా చేస్తుంది. దీంతో బోగీలు పట్టాలు తప్పి నా.. ప్రమాద తీవ్రత, ప్రాణనష్టం తక్కువుంటుంది. ఎస్2 బోగీ చక్రంలో లోపమే ప్రమాదానికి కారణం కావొచ్చని ప్రకాశ్ శర్మ అనే ప్రయాణికుడు తెలిపాడు. తను ఇండోర్‌లో ఎక్కి ఉజ్జరుునిలో దిగేంతవరకు బోగీ చక్రం నుంచి శబ్దం వచ్చిందని దీనిపై అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోలేదన్నారు.
కుటుంబంతో పెళ్లికి వెళ్తూ
కాన్పూర్ రైలు ఘటనలో నుజ్జునుజ్జరుున ఎస్1 బోగీలో భోపాల్‌కు చెందిన అరుణ్ శర్మ కుటుంబం (భార్య, ఇద్దరు పిల్లలు) ప్రయాణిస్తోంది. వీరు పట్నాలో జరిగే బంధువుల పెళ్లికి బయలుదేరారు. గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో శర్మ కుటుంబం కూడా తీవ్రంగా గాయపడింది. ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆర్మీ బలగాలు వీరిని రక్షించి ఆసుపత్రికి తరలించారుు. అరుుతే.. భార్య, పెద్ద కుమారుడు గాయాలతో ఆసుపత్రిలో చేరినా.. చిన్న కుమారుడి జాడ మాత్రం ఇంకా దొరకలేదని అరుణ్ ఆవేదనగా తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకోసం.. పిల్లలు తమ పెద్దవారి కోసం ఆసుపత్రి వద్ద గాయాలతోనే వెతకటం కలచివేస్తోంది.
అమ్మ, తమ్ముడు ఎక్కడ?
పట్నాకు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక తమ్ముడితో కలిసి ఇండోర్‌లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. తల్లి కూడా వీరికి తోడుగా వెళ్లింది. పోటీలు ముగించుకుని తిరుగు ప్రయాణమైన వీరి కుటుంబాన్ని రైలు ప్రయాణం ఓ కుదుపు కుదిపింది. తమ్ముడు, తల్లి ఆచూకీ దొరక్కపోవటంతో ఆ బాలిక తమవారికోసం వెతకటం కంటతడి పెట్టించింది.
ప్రముఖుల దిగ్భ్రాంతి
‘ప్రమాదం విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు. ‘దుర్ఘటన చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను’అని ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా రైలు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఘటన చాలా బాధాకరం’అన్నారు. యూపీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయకచర్యల్లో చురుగ్గా పాలు పంచుకోవాలని ఆదేశించారు.
పుఖ్రయా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
ఎలా జరిగింది?
ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇండోర్ నుంచి బయలు దేరింది. రాత్రి 12.45 గంటల ప్రాంతంలో యూపీలోని ఒరాయ్ స్టేషన్‌లో రెండు నిమిషాలు హాల్ట్ తర్వాత కాన్పూర్‌కు బయలుదేరింది. తెల్లవారుజామున 4 గంటలకు కాన్పూర్ చేరుకోవాలి. కానీ అంతకుముందే 3.10 గంటల ప్రాంతంలో పుఖ్రయా-మలాసా స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ స్టేషన్ల మధ్యలో ఒకచోట పట్టా విరిగి పోవటంతో (ఇదే కారణమని ప్రాథమిక అంచనా) వేగంగా ఉన్న రైలు పట్టాలు తప్పటం, ఎస్ 1, ఎస్2 బోగీలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోవటం క్షణాల్లో జరిగిపోయారుు. ఎస్3, ఎస్4 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నారుు. దీంతో ఈ నాలుగు బోగీల్లోనే మృతులు, క్షతగాత్రులు ఎక్కువగా ఉన్నారు. అప్పటికే విరిగిన పట్టాను దాటిన జనరల్, ఎస్ 12 నుంచి ఎస్ 5 వరకు బోగీలు, వెనకున్న ఏసీ బోగీ కుదుపులకు గురయ్యారుు. వీటిలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయని ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ సక్సేనా వెల్లడించారు. రైలు పట్టా విరగటమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్థారణకు వచ్చినా.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అరుుతే ఘటనకు తొమ్మిది నిమిషాల ముందే అదే ట్రాక్‌పై సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించింది.
తండ్రి కోసం..
డిసెంబర్ 1న తన కూతురు రూబీ పెళ్లిని ఘనంగా చేయాలన్న కోటి ఆశలతో రాంప్రసాద్ గుప్త కుటుంబం ఇండోర్ నుంచి సొంత గ్రామం మౌకు ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరింది. రూబీతోపాటు ఆమె చెల్లెళ్లు, తమ్ముళ్లూ ఉన్నారు. ఇంతలోనే అనుకోని ప్రమాదం ఈ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రమాదం నుంచి అందరూ గాయాలతో బయటపడినా గుప్త ఆచూకీ మాత్రం ఆదివారం రాత్రి వరకు దొరకలేదు. విరిగిన చేతికి కట్టుకట్టుకుని రూబీ.. తండ్రి కోసం ఏడుస్తూ వెతకటం కలచివేసింది.
దేశంలో 1988 నుంచి అతి పెద్ద రైలు ప్రమాదాలు
1988 ఏప్రిల్ 18: ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ వద్ద పట్టాలు తప్పిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్. 75 మంది మృతి.
1988 జూలై 8: కేరళలోని అష్టముడి సరస్సులోకి పడిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్. 107 మంది మృతి.
1995 ఆగస్టు 20: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్‌లో కలిండి ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న పురుషోత్తం ఎక్స్‌ప్రెస్. 400 మంది దుర్మరణం.
1997 సెప్టెంబర్ 14: మధ్యప్రదేశ్ బిలాస్‌పూర్ జిల్లాలో నదిలోకి పడ్డ అహ్మదాబాద్-హౌరా ఎక్స్‌ప్రెస్‌లోని ఐదు బోగీలు. 81 మంది మృతి
1998 నవంబర్ 26: పంజాబ్‌లోని ఖన్నా వద్ద పట్టాలు తప్పిన ఫ్రంటియర్ మెరుుల్ రైలు బోగీలను ఢీకొన్న జమ్మూ తావి-సియాల్దా ఎక్స్‌ప్రెస్. 212 మంది మృతి.
1999 ఆగస్టు 2: అస్సాంలోని గైసల్ వద్ద రెండు ప్రయాణికుల రైళ్లు ఢీ. 290 మంది మృతి.
2002 సెప్టెంబర్ 9: బిహార్‌లోని ఔరంగాబాద్‌లో ధావే నదిలోకి పడ్డ హౌరా-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్. 100 మంది మృతి. 150 మందికి గాయాలు.
2010 మే 28: పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో జ్ఞానేశ్వరీ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించిన నక్సల్స్. 148 మంది మృతి.
2014 మే 4: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ వద్ద పట్టాలు తప్పిన సవంత్‌వాడీ ప్యాసింజర్. 20 మంది దుర్మరణం. 100 మందికి గాయాలు.
2014 మే 26: ఉత్తరప్రదేశ్‌లోని కబీర్‌నగర్ జిల్లాలో సరకు రవాణా రైలును ఢీకొన్న గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్. 25 మంది మృతి. క్షతగాత్రులైన 50 మంది.
2015 మార్చి 20: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ వద్ద పట్టాలు తప్పిన డెహ్రాడూన్-వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్. 39 మంది మృతి. 150 మందికి గాయాలు.
2015 ఆగస్టు 4: మధ్యప్రదేశ్‌లోని హార్ధా జిల్లాలో పట్టాలు తప్పిన కామాయణి ఎక్స్‌ప్రెస్. 25 మంది మృతి. 25 మందికి గాయాలు. ఇది జరిగిన సరిగ్గా నిమిషం తర్వాత ఇదే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న జనతా ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పింది.