మావోలు పేల్చేసిన వాహనం
సాక్షి, ముంబై, హైదరాబాద్, భూపాలపల్లి/ గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కూంబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీస్ విభాగం క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వ్యాను తునాతునకలైంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు మావోయిస్టుల ఏరివేతకు అదనపు బలగాలను ఘటనాస్థలికి పంపారు. కాగా, మావోయిస్టుల దుశ్చర్యను ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సీఎం ఫడ్నవీస్‌తో పాటు పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. మరోవైపు మావోయిస్టులకు దీటైన జవాబు ఇస్తామని మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ జైశ్వాల్ ప్రకటించారు. మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవమైన మే 1నే మావోయిస్టులు ఈ ఘాతుకానికి తెగబడటం గమనార్హం.
పక్కాగా వలపన్ని దాడి..
పక్కా ప్రణాళిక ప్రకారమే మావోయిస్టులు కమాండోలను ఉచ్చులోకి లాగి హత్య చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. గడ్చిరోలి జిల్లాలోని దాదర్‌పూర్ గ్రామ సమీపంలో 136వ జాతీయ రహదారి పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున పలువురు మావోయిస్టులు ఇక్కడకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు వాడుతున్న జేసీబీలు, ట్రాక్టర్లు, డంపర్లు సహా 36 వాహనాలపై కిరోసిన్, డీజిల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న క్యూఆర్టీ కమాండోల బృందం అక్కడకు బయలుదేరింది. వీరి వాహనం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుర్ఖేదా ప్రాంతంలోని లెన్ధారీ వద్దకు రాగానే రోడ్డుపై చెట్లు పడిపోయి ఉన్నాయి. వెంటనే వ్యాను నుంచి దిగిన కమాండోలు వాటిని తొలగించబోతుండగా అక్కడే నక్కిన మావోలు ఒక్కసారిగా మందుపాతరను పేల్చారు. అనంతరం పేలుడుకు చెల్లాచెదురైన కమాండోలపై అన్నివైపుల నుంచి చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కమాండోలు ఎదురుకాల్పులు జరుపుతూనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు.
సాధారణ వ్యానులో ప్రయాణం..
మావోయిస్టులకు గట్టి పట్టున్న గడ్చిరోలిలో కూంబింగ్ సందర్భంగా భద్రత విషయంలో పోలీస్ కమాండోలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆపరేషన్‌కు వెళుతూ కూడా వీరంతా మైన్‌ప్రూఫ్ వాహనంలో కాకుండా సాధారణ వ్యానులో ప్రయాణించడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయమై మహారాష్ట్ర పోలీస్ డీజీపీ సుబోధ్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘నిఘా వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఇప్పుడే చెప్పడం సరికాదు. ఈ కూంబింగ్‌కు ఓ ప్రైవేటు వాహనాన్ని ఎందుకు ఎంచుకున్నారు? క్యూఆర్టీ కమాండోల కదలికలపై మావోయిస్టులకు ముందే సమాచారం అందిందా? అనే కోణంలో విచారణ జరుపుతాం. మావోయిస్టులకు దీటుగా బదులివ్వగలిగే సత్తా మాకుంది. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకే మావోలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. గడ్చిరోలిలో ఎన్నికలు పూర్తయిందున దాడులకు ఎన్నికలను ముడిపెట్టలేమని స్పష్టం చేశారు. కాగా, 2018, ఏప్రిల్‌లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్‌లో 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.
దాడి వెనుక తెలంగాణ మావోయిస్టు కమిటీ
గడ్చిరోలి దాడికి మావోయిస్టులు చాలాకాలం క్రితమే పథక రచన చేశారని నిఘావర్గాలు తెలిపాయి. ఈ దాడి పథకం అమలులో తెలంగాణ మావోయిస్టు కమిటీ నాయకులే కీలకమని వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌లో కనీసం 100 మంది పాల్గొని ఉంటారని పేర్కొన్నాయి. మరోవైపు హైఅలర్ట్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు, గ్రేహౌండ్స్ బలగాలను సరిహద్దు ప్రాంతానికి తరలించారు. గడ్చిరోలిలో కూంబింగ్ నుంచి తప్పించుకునేందుకు మావోలు తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లో ప్రవేశించే అవకాశముండటంతో గాలింపును ముమ్మరం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వీవీఐపీలు, రాజకీయ నేతలను పోలీసులు అప్రమత్తం చేశారు.
మహారాష్ట్రలో నెత్తుటి మరకలు
మహారాష్ట్రలో భద్రతాబలగాలు లక్ష్యంగా గతంలో మావోయిస్టులు చేసిన దాడులివే..
► 2009, ఫిబ్రవరి 1: గడ్చిరోలి జిల్లాలోని మోర్కే గ్రామం వద్ద మావోలు జరిపిన దాడిలో గస్తీ బృందానికి చెందిన 15 మంది పోలీసులు దుర్మరణం.
► 2009, మే 21: మహారాష్ట్రలోని మురు మ్ గ్రామం వద్ద మావోల మెరుపుదాడి లో 16 మంది పోలీస్ సిబ్బంది మృతి.
► 2009, అక్టోబర్ 8: గడ్చిరోలిలోని లహేరీ వద్ద ఎదురుకాల్పులు. 17 మంది పోలీసులు దుర్మరణం.
► 2011, మే 19: భమ్రాగఢ్ తాలుకాలో మావోయిస్టుల మెరుపుదాడి. నలుగురు పోలీస్ సిబ్బంది మృతి.
► 2012, మార్చి 27: ధనోరాలో సీఆర్పీఎఫ్ బస్సును పేల్చివేసిన మావోలు. 12 మంది సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్ జవాన్లు మృత్యువాత. మరో 28 మందికి తీవ్రగాయాలు.
దోషులను వదిలిపెట్టం: మోదీ
‘గడ్చిరోలిలో మన భద్రతాసిబ్బందిపై మావోయిస్టుల హేయమైన దాడిని ఖండిస్తున్నా. ఈ హింసకు పాల్పడ్డ దోషులను వదిలిపెట్టబోం. అమరులైన వీరులకు నా సెల్యూట్. వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోం. అమరుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని చెప్పారు.
పిరికిపందల చర్య: రాజ్‌నాథ్
‘తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన మావోలు ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. మావోల దుశ్చర్య విషయమై సీఎం ఫడ్నవీస్‌తో ఇప్పుడే మాట్లాడాను. మహారాష్ట్రకు కేంద్రం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. హోంశాఖ వర్గాలు గడ్చిరోలి జిల్లా యంత్రాంగంతో టచ్‌లో ఉన్నాయి. ఈ దుర్ఘటనలో అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వీరి త్యాగం వృధాగా పోదు’ అని తెలిపారు.
ప్రగాఢ సానుభూతి
తెలియజేస్తున్నా: రాహుల్
‘గడ్చిరోలీలో మన భద్రతాసిబ్బందిపై దాడి గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. తమ ప్రియమైనవారిని కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందిస్తూ..‘ఈ విషాద సమయంలో నేను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. దేశం మొత్తం మావోల హింసను వ్యతిరేకిస్తోంది. ఈ హింసాత్మక భావజాలాన్ని కలసికట్టుగా ఓడిస్తాం’ అని పేర్కొన్నారు.
దాదర్‌పూర్‌లో మావోయిస్టులు తగులబెట్టిన వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment