కామ్‌రూప్‌లో మీడియాతో మంత్రి అమిత్‌షా
గువాహటి/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా సిబ్బందిపై దాడికి కారణమైన వారికి సరైన సమయంలో సరైన జవాబు చెబుతామని కేంద్ర హోంశాంఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సంఖ్యను బట్టి చూస్తే ఈ ఘటనలో ఇరువైపులా నష్టం వాటిల్లిందని, ఎంతమంది చనిపోయారన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అస్సాంలో ఉన్న అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ గురించి తెలియగానే ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే విరమించుకున్నారు. హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశమై, తాజా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నక్సలైట్ల దాడిలో మన భద్రతా సిబ్బంది అమరులయ్యారు.
ఈ హింసాకాండను సహించే ప్రసక్తే లేదు. బాధ్యులకు సరైన సమయంలో దీటైన జవాబు ఇచ్చితీరుతాం’’ అని తేల్చిచెప్పారు. అంతకుముందు ఆయన జల్కాబారీ నియోజకవర్గంలో, బార్‌పేట జిల్లా సోర్భోగ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌ఈడీఏ) అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అస్సాం అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా అంటూ లేదని విమర్శించారు. ఎన్డీయే నేతృత్వంలోని ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం అస్సాంను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక టూరిస్టులాగా అస్సాంకు వచ్చివెళ్తున్నాడని అమిత్ షా వ్యాఖ్యానించారు. అస్సాంలో ఇప్పటికే జరిగిన రెండు దశల ఎన్నికల్లో బీజేపీ కూటమి అత్యధిక స్థానాలను దక్కించుకోబోతోందని జోస్యం చెప్పారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో దీదీ మమతా బెనర్జీ ఇంటికెళ్లబోతున్నారని, బీజేపీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. అస్సాంలో బీజేపీని మళ్లీ గెలిపిస్తే రాజధాని గువాహటిని ఆగ్నేయ ఆసియాకు స్టార్టప్ రాజధానిగా మారుస్తామని ఉద్ఘాటించారు.
నక్సలైట్లపై విజయం తథ్యం
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి, పరిస్థితిని స్వయంగా సమీక్షించాలని ఆదివారం సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్‌కు ఆదేశాలు జారీచేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నక్సలైట్లు కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి ఈ దురాగతానికి పాల్పడినట్లు భూపేష్ భగేల్ చెప్పారు. వారి సిద్ధాంతాల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. తీవ్రవాదులకు పరాజయం తప్పదని పేర్కొన్నారు. భద్రతా బలగాలు నైతిక స్థైర్యం కోల్పోలేదని, ఈ పోరాటంలో నక్సలైట్లపై కచ్చితంగా విజయం సాధిస్తారని అమిత్ షాకు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు కలిసి పోరాడుతున్నాయని, విజయ బావుటా ఎగురవేస్తాయని అమిత్ షా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
అమిత్ షా ట్వీట్
ఛత్తీస్‌గఢ్‌లో తీవ్రవాదులతో జరిగిన పోరాటంలో అమరులైన భద్రతా సిబ్బంది ప్రదర్శించిన ధైర్యసాహసాలు మరువలేనివని అమిత్ షా శ్లాఘించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. శాంతి, అభివృద్ధి కోసం శత్రువులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అమిత్ షా ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment