
పాతికేళ్ల పోరాటం వృథా!
కుటుంబసభ్యులను కోల్పోయిన ఆ బాధితులు పాతికేళ్లకుపైగా చేసిన పోరాటం వృథా అయింది!
హాశింపురా హత్యాకాండ కేసులో 16 మంది విడుదల
నిందితులను గుర్తించేందుకు సాక్ష్యాలు లేవన్న ఢిల్లీ కోర్టు
యూపీ కానిస్టేబుళ్లపై అభియోగాల కొట్టివేత
న్యూఢిల్లీ: కుటుంబసభ్యులను కోల్పోయిన ఆ బాధితులు పాతికేళ్లకుపైగా చేసిన పోరాటం వృథా అయింది! సాయుధ పోలీసుల కర్కశత్వానికి బలైన ఆ కుటుంబాలు న్యాయం కోసం చేసిన సుదీర్ఘ నిరీక్షణ ఫలించలేదు. హాశింపురా హత్యాకాండ కేసులో నిందితులైన 16 మంది యూపీ ప్రాంతీయ సాయుధ కానిస్టేబుళ్ల(పీఏసీ) దళం సిబ్బందిని ఢిల్లీ కోర్టు శనివారం నిర్దోషులుగా ప్రకటించింది. 1987లో యూపీలోని మీరట్ జిల్లా హాశింపురా గ్రామంలో 42 మంది ముస్లింలను హతమార్చిన ఘటనలో ఇన్నేళ్ల విచారణ తర్వాత నిందితులంతా కేసు నుంచి విముక్తులయ్యా రు.
వీరిని గుర్తించడానికి తగిన సాక్ష్యాధారాలు లేనందువల్ల సంశయలాభం కింద వారిని విడుదల చేస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ జిందాల్ తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబాల పునరావాసం ఈ కేసును ఢిల్లీ రాష్ర్ట న్యాయసేవల సంస్థ పరిశీలనకు పంపారు. గత జనవరిలోనే ఈ కేసులో తుది వాదనలు పూర్తయ్యాయి. ఆ తర్వాత తీర్పును కోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. అయితే గత నెలలో ఇరుపక్షాల తరఫు న్యాయవాదుల నుంచి మరికొంత సమాచారా న్ని కోరిన కోర్టు.. తాజాగా ఈ తీర్పునిచ్చింది.
హాశింపురాలో ఏం జరిగిందంటే..
బాధితుల కథనం ప్రకారం.. 1987లో మీరట్ జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్న సమయంలో మే 22న హాశింపురా గ్రామానికి వచ్చిన ప్రాంతీయ సాయుధ కానిస్టేబుళ్ల(పీఏసీ) దళాలకు చెందిన 41వ బెటాలియన్ సభ్యులు అక్కడి ఓ మసీదు వద్ద గుమిగూడిన 500 మందిలో 50 మంది వరకు ముస్లింలను తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. ఆ తర్వాత వారిని కాల్చి చంపి సమీపంలోని ఓ కాలువలో పడేశారు. ఈ హత్యాకాండలో మొత్తం 42 మంది చనిపోయినట్లు అనంతరం గుర్తించారు. దీనిపై విచారణ జరిపిన యూపీ సీఐడీ విభాగం 1996లో గజియాబాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
హత్య, హత్యాయత్నం, కుట్ర, సాక్ష్యాధారాలను మార్చడం వంటి పలు అభియోగాలతో 19 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 2002లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. అక్కడ 2006లో 17 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇన్నేళ్ల విచారణ సందర్భంగా నిందితుల్లో ఒకరు చనిపోయారు. 161 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న కోర్టు.. తాజాగా నిందితులందరినీ నిర్దోషులుగా వదిలేసింది.