వచ్చే ఎన్నికలకు 16 లక్షల కొత్త ఈవీఎంలు
దాదాపు రెండేళ్ల తర్వాత.. 2019 సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం పేపర్ ట్రయల్‌తో కూడిన 16 లక్షల కొత్త ఈవీఎంలు సిద్ధం అవుతున్నాయి. వీటి కొనుగోలు కోసం కేంద్ర మంత్రివర్గం రూ. 3వేల కోట్లను మంజూరుచేసింది. 2018 సెప్టెంబర్ నాటికల్లా కొత్త ఈవీఎంలను సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. వాటిని బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ సంస్థలు తయారుచేస్తాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు తగినంత ముందుగానే వీవీపాట్‌లను సిద్ధం చేయాలని, వీటి ఉత్పత్తిని కమిషన్ చాలా జాగ్రత్తగా గమనిస్తుందని ఈసీ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఈవీఎం వద్ద వీవీపాట్‌లు ఏర్పాటుచేస్తామని వివరించాయి.
పేపర్ ట్రయల్ లేకుండా ఈవీఎంలను ఉపయోగించడం వల్ల ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ వద్ద మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 16 పార్టీలు ఈసీ వద్దకు వెళ్లి.. పారదర్శకత ఉండాలంటే పేపర్ బ్యాలెట్ పద్ధతిని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరాయి. వీవీపాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) మిషన్లను ఏర్పాటుచేయాలని 2013లోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకు కనీసం 11 సార్లు ప్రభుత్వాలకు నిధులివ్వాల్సిందిగా కూడా తెలిపింది. ఎట్టకేలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు ఈ మిషన్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేసింది.
మిషన్ ఎలా పనిచేస్తుంది
వీవీపాట్ మిషన్ ఉన్నప్పుడు.. ఈవీఎంలో ఎవరికి ఓటేశామో తెలియజేసేలా ఒక కాగితం స్లిప్ వస్తుంది. అది ఏడు సెకండ్ల పాటు ఓటర్లకు కనిపించి, ఆ తర్వాత ఒక బాక్సులో పడిపోతుంది. అంటే ఓటర్లు తాము ఎవరికి ఓటేశామో వారికే పడిందో లేదో చూసుకోవచ్చు గానీ.. ఆ స్లిప్‌ను బయటకు తీసుకెళ్లడానికి మాత్రం కుదరదన్న మాట.