
పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక
1965 యుద్ధంపై హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి, కశ్మీరీలు 1965లో పాక్ చొరబాటును సమర్థంగా తిప్పికొట్టారని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1965 యుద్ధం పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక అని, అందులో ఆ దేశ సైన్యం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయితే ఆ వైఫల్యాన్ని కప్పిపెట్టారన్నారు. ఆ యుద్ధానికి 50 ఏళ్లయిన నేపథ్యంలో మంగళవారమిక్కడ త్రివిధ దళాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్సారీ ప్రసంగించారు. కశ్మీర్‌లోకి చొరబాటుదారులను పంపి, స్థానికుల మద్దతు కూడగట్టి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు 1965, ఆగస్టు 5న పాకిస్తాన్ 'ఆపరేషన్ జీబ్రాల్టర్' ప్రారంభించిందని చెప్పారు.
ఆ విషయాన్ని కశ్మీరీ ప్రజలు భద్రతా బలగాలకు చేరవేసి పాక్ కుయుక్తులను తిప్పికొట్టారన్నారు. ఈ పన్నాగం విఫలమవడంతో పాక్ రెండో కార్యాచరణను ప్రారంభించి, సరిహద్దులో భారత బలగాలపై కాల్పులకు పాల్పడిందని వివరించారు. కాగా, జమ్మూకశ్మీర్‌ను అస్థిరపరిచేందుకు పాక్ కొత్త పద్ధతుల్లో కుయుక్తులు పన్నుతోందని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ చెప్పారు. భవిష్యత్తులో చిన్నపాటి యుద్ధాలకు సైతం భారత్ సిద్ధంగా ఉందన్నారు.