
‘సీబీఐ ఉరి తీయాలంది.. ఆలోపే చనిపోయాడు’
ముంబయి: 1993నాటి ముంబయి పేలుళ్ల కేసులో దోషి ముస్తఫా దోసా మృతిచెందాడు. తీవ్ర అనారోగ్యంతో జేజే ఆస్పత్రిలో చేరిన అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ముంబయి పేలుళ్ల కేసులో ఇటీవలె టాడా కోర్టు దోసాను దోషిగా తేల్చింది. శిక్ష కాలాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ముంబయిలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న దోసాకు తీవ్ర జ్వరం రావడంతోపాటు అధిక రక్తపోటు సమస్య తలెత్తడంతో జేజే ఆస్పత్రికి తరలించారు.
అక్కడే చికిత్స పొందుతూ బుధవారం 2.30గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు ఆస్పత్రిలోని టీపీ లహానే అనే వైద్యుడు తెలిపారు. గతంలోనే అతడికి బైపాస్ సర్జరీ అయిందని.. తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి రావడంతో ఈ రోజు ఉదయం నుంచి పలుమార్లు గుండెపోటు వచ్చిందని వివరించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందజేస్తామని పోలీసులు చెప్పారు. ముంబయి పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన యాకుబ్ మీనన్‌కు, ముస్తాఫా దోసాకు, ఫిరోజ్ ఖాన్‌కు మరణ శిక్ష విధించాలంటూ ఈ కేసును విచారిస్తున్న సీబీఐ నిన్ననే కోర్టును కోరింది.