
మోదీ కేబినెట్‌లోకి మరో 21 మంది
దత్తన్నకు కార్మిక శాఖ.. స్వతంత్ర హోదాతో పదవి
శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రిగా సుజనాచౌదరి
నలుగురికే కేబినెట్ హోదా.. ముగ్గురు స్వతంత్రుల
14 మంది సహాయ మంత్రులు
మొత్తం 66కు పెరిగిన కేంద్ర మంత్రుల సంఖ్య
ఐదుకు చేరిన తెలుగు వారి సంఖ్య
శివసేన నేత సురేశ్‌ప్రభుకు బీజేపీ తీర్థ
కేబినెట్ హోదా మంత్రిగా ప్రమాణ స్వీకారం
పారికర్‌కు రక్షణ శాఖ, సురేశ్ ప్రభుకు రైల్వే శాఖ
రైల్వే నుంచి న్యాయ శాఖకు సదానంద గౌడ
ప్రమాణ స్వీకారానికి శివసేన దూరం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు మంత్రివర్గ విస్తరణలో బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ నుంచి ఆ పార్టీ ఏకైక ఎంపీ బండారు దత్తాత్రేయకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వతంత్ర సహాయ మంత్రి పదవి కేటాయించారు. తెలంగాణ నుంచి ఒకరికి కేబినెట్ హోదా దక్కుతుందని, పార్టీ ఉపాధ్యక్షుడిగా, సీనియర్ నేతగా ఉన్న తనకు కేబినెట్ హోదా కల్పిస్తారని ఆశించిన దత్తాత్రేయ చివరికి స్వతంత్ర హోదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకు కార్మికశాఖను కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబునాయుడు సన్నిహితుడు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.సత్యనారాయణచౌదరి (సుజనాచౌదరి)కి సహాయ మంత్రి పదవి దక్కింది. ఆయనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్ శాఖలు కేటాయించారు. వీరిద్దరితో సహా మొత్తం 21 మంది కొత్త వారితో మోదీ మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్త మంత్రులంతా ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం వరకు కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని సహా మొత్తం 45 మంది ఉండగా.. తాజా విస్తరణతో మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 66 కు పెరిగింది. మోదీ కేబినెట్‌లో తెలుగువారి సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే ఎం.వెంకయ్యనాయుడు (కర్ణాటక నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు), పూసపాటి అశోకగజపతిరాజు (టీడీపీ),
నిర్మలాసీతారామన్ (బీజేపీ)లు కేంద్ర మంత్రివర్గంలో ఉండగా.. తాజాగా ఈ జాబితాలో దత్తాత్రేయ, సుజనాచౌదరిలు చేరారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన 21 మంది కొత్త మంత్రుల్లో నలుగురికి కేబినెట్ హోదా, ముగ్గురికి స్వతంత్ర సహాయ మంత్రి హోదా, 14 మందికి సహాయ మంత్రి హోదా లభించింది. దీంతో ప్రస్తుతం ప్రధాని కాకుండా కేబినెట్ ర్యాంకులో 26 మంది, 13 మంది స్వతంత్ర హోదా, 26 మంది సహాయ మంత్రి పదవిలో ఉన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఆదివారం రాత్రికి శాఖలు ఖరారు చేశారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న పలువురి శాఖల్లో మార్పులు చేస్తూ కొత్త వారికి శాఖలు కేటాయించారు. సదానందగౌడ వద్ద ఉన్న రైల్వే శాఖను సురేశ్‌ప్రభుకు అప్పగించారు. సదానందకు న్యాయశాఖను కేటాయించారు. ఇప్పటివరకూ న్యాయశాఖ రవిశంకర్‌ప్రసాద్ వద్ద అదనంగా ఉంది. అరుణ్‌జైట్లీ వద్ద అదనంగా ఉన్న రక్షణశాఖను మనోహర్‌పారికర్‌కు అప్పగించారు. కొత్తగా కేబినెట్‌లో చేరిన జె.పి.నడ్డాకు ఆరోగ్యశాఖను కేటాయించారు. ఇప్పటివరకూ ఈ శాఖను చూసిన హర్షవర్ధన్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను అప్పగించారు. కొత్తగా ప్రమాణం చేసిన చౌదరీ వీరేంద్రసింగ్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుధ్యం శాఖలు కేటాయించారు.
విస్తరణలో యూపీ నుంచి నలుగురికి చోటు
మంత్రివర్గ తాజా విస్తరణలో ఉత్తరప్రదేశ్‌కు ప్రాధాన్యం లభించింది. ఆ రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలకు చోటు దక్కింది. అలాగే బీహార్ నుంచి ముగ్గురికి మహారాష్ట్ర నుంచి ఇద్దరికి, గుజరాత్ నుంచి ఇద్దరికి, రాజస్థాన్ నుంచి ఇద్దరికి చోటు కల్పించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు రాష్ట్రపతిభవన్‌లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఇప్పటివరకు గోవా సీఎంగా పనిచేసిన మనోహర్‌పారికర్, తరువాత వరుసగా సురేశ్‌ప్రభాకర్‌ప్రభు, జె.పి.నడ్డా, చౌదరి బీరేంద్రసింగ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులుగా బండారు దత్తాత్రేయ, రాజీవ్‌ప్రతాప్ రూడీ, మహేశ్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రులుగా ముక్తార్ అబ్బాస్‌నక్వీ, రాంకృపాల్ యాదవ్, హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి, సన్వర్‌లాల్‌జాట్, మోహన్ కుందారియా, గిరిరాజ్‌సింగ్, హన్స్‌రాజ్ అహిర్, ప్రొఫెసర్ రాంశంకర్ కతీరియా, వై.ఎస్.చౌదరి, జయంత్‌సిన్హా, కల్నల్ రాజ్‌వర్ధన్‌సింగ్ రాథోడ్, బాబుల్ సుప్రియో, సాధ్వీ నిరంజన్ జ్యోతి, విజయ్‌సాంప్ల వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 2.15కు ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యింది. అంతకుముందు ఉదయం పది గంటలకు ప్రధాని మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు.
విస్తరణను బహిష్కరించిన శివసేన...
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు బీజేపీ మిత్రపక్షమైన శివసేన దూరంగా ఉంది. తమ పార్టీకి రెండు కేబినెట్ పదవులు ఇవ్వాలని శివసేన డిమాండ్ చేయగా.. ఆ పార్టీకి కేవలం ఒక సహాయ మంత్రి పదవి మాత్రమే ఇవ్వగలమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తేల్చిచెప్పినట్లు సమాచారం. పైగా శివసేన ప్రతిపాదించిన అనిల్‌దేశాయ్‌ను సహాయ మంత్రి పదవిగా తీసుకోవాలని.. ఆ పార్టీ ప్రతిపాదించని సురేశ్‌ప్రభాకర్‌ప్రభును కేబినెట్ హోదాలోకి తీసుకోవాలని ప్రధాని మోదీ భావించినట్లు తెలిసింది. ఆ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపిన జాబితాలో అనిల్‌దేశాయ్ పేరు కూడా ఉంది. అయితే ఈ ప్రతిపాదనను శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే వ్యతిరేకించారు. అయితే శివసేన నేత సురేశ్‌ప్రభు ఆదివారం ఉదయం బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి కేబినెట్ మంత్రిగా పదవి చేపట్టటంతో ఇప్పటికే దెబ్బతిన్న రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ చేరుకున్న అనిల్‌దేశాయ్‌ను విమానాశ్రయం నుంచే వెనుదిరగాల్సిందిగా ఆదేశించిన శివసేన అధినాయకత్వం.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా బహిష్కరించింది. ఈ పరిణామంతో కేంద్రంలో ఎన్‌డీఏ కూటమికి శివసేన ఇక దూరమైనట్టేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మోదీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తన పార్టీ నేత అనంత్‌గీతెను కూడా రాజీనామా చేయించి, మహారాష్ట్ర శాసనసభలో సైతం ప్రతిపక్షంలో కూర్చోవాలని శివసేన యోచిస్తున్నట్లు చెప్తున్నారు.
ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి హమీద్‌అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, పూసపాటి అశోక్‌గజపతిరాజు, నిర్మలాసీతారామన్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు హాజరయ్యారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసిన దత్తాత్రేయ, సుజనాచౌదరిల కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కొత్త మంత్రులు వీరే...
కేబినెట్ మంత్రులు
మనోహర్ పారికర్ (గోవా, బీజేపీ) - రక్షణ
సురేశ్‌ప్రభాకర్ ప్రభు (మహారాష్ట్ర, కొత్తగా బీజేపీలో చేరిక) - రైల్వే
జగత్‌ప్రకాశ్ (జేపీ) నడ్డా (హిమాచల్‌ప్రదేశ్, బీజేపీ)- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
చౌదరి బీరేందర్‌సింగ్ (హర్యానా, బీజేపీ, జాట్ నేత) - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు-పారిశుధ్ధ్యం
స్వతంత్ర సహాయ మంత్రులు:
బండారు దత్తాత్రేయ (తెలంగాణ, బీజేపీ) - కార్మిక, ఉపాధి కల్పన
రాజీవ్‌ప్రతాప్ రూడీ (బీహార్, బీజేపీ) - నైపుణ్యాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు
డాక్టర్ మహేశ్‌శర్మ (యూపీ, బీజేపీ) - సాంస్కృతిక- పర్యాటకం, పౌర విమానయానం
సహాయ మంత్రులు
ముక్తార్ అబ్బాస్ నక్వీ (యూపీ, బీజేపీ) - మైనారిటీ, పార్లమెంటరీ వ్యవహారాలు
రాంకృపాల్ యాదవ్ (బీహార్, బీజేపీ) - తాగునీరు, పారిశుద్ధ్యం
హరిభాయ్ చౌధురి (గుజరాత్, బీజేపీ) - హోం
సన్వర్‌లాల్ జాట్ (రాజస్థాన్, బీజేపీ) - జలవనరులు, గంగా పారిశుద్ధ్యం
మోహన్‌భాయ్ కుందారియా (గుజరాత్, బీజేపీ) - వ్యవసాయం
గిరిరాజ్‌సింగ్ (బీహార్, బీజేపీ) - సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
హన్స్‌రాజ్ గంగారాం అహిర్ (మహారాష్ట్ర, బీజేపీ) - రసాయనాలు, ఎరువులు
రాంశంకర్ కతీరియా (యూపీ, బీజేపీ) - మానవ వనరుల అభివృద్ధి
వై.ఎస్.చౌదరి (ఏపీ, టీడీపీ) - శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞానం
జయంత్‌సిన్హా (జార్ఖండ్, బీజేపీ)- ఆర్థికం
రాజ్‌వర్ధన్‌సింగ్ రాథోడ్ (రాజస్థాన్, బీజేపీ) - సమాచార, ప్రసారం
బాబుల్ సుప్రియో (పశ్చిమబెంగాల్, బీజేపీ) - పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం
సాధ్వీ నిరంజన్ జ్యోతి (యూపీ, బీజేపీ)- ఆహారశుద్ధి పరిశ్రమ
విజయ్ సాంప్లా(పంజాబ్, బీజేపీ) - సామాజిక న్యాయం, సాధికారత
మార్పులు చేర్పుల తర్వాత
1. అరుణ్ జైట్లీ- ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు, అదనంగా సమాచార, ప్రసార శాఖ
2. సదానంద గౌడ- న్యాయశాఖ
3. హర్షవర్ధన్- శాస్త్ర, సాంకేతికం, భూవిజ్ఞానం
4. రవిశంకర్ ప్రసాద్- కమ్యూనికేషన్లు, ఐటీ
5. నిర్మలా సీతారామన్- వాణిజ్యం
6. నితిన్ గడ్కారీ - రోడ్డు రవాణా
7. ప్రకాశ్ జవదేకర్ - పర్యావరణం, అడవులు
8. నరేంద్రసింగ్ తోమర్ - ఉక్కు, గనులు