ముంబైలో ఎగ్జిబిషన్ సెంటర్‌లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న దృశ్యం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడినప్పటికీ ప్రాణాపాయం ఉన్నట్లు కాదు. కరోనా బాధితులు చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారు. భారత్‌లో ఇప్పటిదాకా 6,361 మంది ఆరోగ్యవంతులయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. అంటే మొత్తం బాధితుల్లో 22.41 శాతం మంది కోలుకున్నారని వెల్లడించింది. దేశంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 1,463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 60 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసులు 28,380కు, కరోనా సంబంధిత మరణాలు 886కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 16 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 85 జిల్లాల్లో గత 14 రోజులుగా కేసులేవీ నమోదు కాలేదన్నారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 21,132 కాగా, 6,361 మంది(22.41 శాతం) బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు.
చైనా ర్యాపిడ్ కిట్లు వెనక్కి పంపండి
కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం చైనా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను ఉపయోగించవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. వాటికి వెనక్కి పంపించాలని సోమవారం సూచించింది. వాటిని తాము చైనాకు తిరిగి పంపుతామని పేర్కొంది. చైనాలోని గాంగ్‌జౌ వోండ్‌ఫో బయోటెక్, ఝూజై లివ్‌సన్ డయాగ్నోస్టిక్స్ అనే రెండు సంస్థల నుంచి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను భారత్ కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి నాణ్యత, పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కిట్లు కచ్చితమైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కిట్ల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. వాటిని వెనక్కి పంపాలని రాష్ట్రాలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment