
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై బన్నాటోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు ఓ వ్యానులో వచ్చి కాల్పులు జరిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తోన్న పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్ జవాన్లు తిరిగి ఎదురుకాల్పులకు దిగడంతో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47రైఫిల్, గ్రెనెడ్లను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ముకేష్ సింగ్ చెప్పారు.