ఆ ఇంట్లో 31 ఏసీలు.. 12 గీజర్లు!!
ఒక ఇంట్లో ఎన్ని ఏసీలు అవసరం అవుతాయి.. మహా అయితే మూడు లేదా నాలుగు అంతే కదా. కానీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసంలో ఎన్ని ఏసీలుండేవో తెలుసా? ఏకంగా 31 ఏసీలు!! వాటితో పాటు 25 రూం హీటర్లు కూడా ప్రత్యేకంగా ఉండేవట. ఈ విషయం అంతా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వివరాలన్నీ వచ్చాయి. నెం.౩ మోతీలాల్ నెహ్రూ మార్గ్లో ఉన్న షీలా దీక్షిత్ అధికారిక నివాసంలో 31 ఏసీలు, 15 డిజర్ట్ కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీజర్లు.. ఇవన్నీ ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి అవసరాలకు అనుగుణంగా బంగ్లాకు మార్పుచేర్పులు చేయడానికి రూ. 16.81 లక్షలు ఖర్చుచేసినట్లు సీపీడబ్ల్యుడీ తెలిపింది.
కేరళ రాష్ట్రానికి గవర్నర్గా ఆమె వెళ్లిపోయేటప్పుడు ఆ ఇంటినుంచి వాటన్నింటినీ తీసేశారు. వాటిలో కొన్నింటిని ప్రస్తుతం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాల మేరకు ఉపయోగిస్తున్నారు. మిగలిన వాటిని అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తామన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షీలా దీక్షిత్ నివసించిన ఈ బంగ్లాను 1920లో కట్టారు. ఇది దాదాపు మూడున్నర ఎకరాల్లోవిస్తరించింది. ఇప్పుడీ బంగ్లాను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు కేటాయించారు. ఆ సమయంలో దానికి రూ. 35 లక్షలతో మరమ్మతులు చేశారు.