
పునర్విభజన చట్టంపై 35మంది కేంద్రమంత్రుల భేటీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విజన చట్టం అమలుపై 35మంది కేంద్రమంత్రులతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణలో అన్ని ప్రాజెక్టుల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరినట్టు వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కేంద్రమంత్రులు మాట్లాడారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు మాట్లాడుతూ.. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. ఏపీ ఎక్స్ప్రెస్ను తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చడం.. అలాగే నూతనంగా నడిపే ఏపీ ఎక్స్ప్రెస్ను విశాఖ వరకు పొడిగించాలనేదానిపై చర్చ జరిగినట్టు సురేష్ప్రభు తెలిపారు.
కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి సాయం అందిస్తామని చెప్పారు. తిరుపతిలో ఐఐటీ ఏర్పాటుకు తమశాఖ అనుమతి తెలిపిందని కేంద్ర మానవవనరుల మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఏపీ, తెలంగాణలో త్వరలో పర్యటిస్తానని రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపానని ఆరోగ్యశాఖ మంత్రి జేపీ అడ్డా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు విభజనపై రెండు రాష్ట్రాల చర్యలు తీసుకోవాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు.