పంట నష్టం 500 కోట్లు
వరి, మొక్కజొన్న (హెక్టార్లలో) 40,000
ఉద్యాన పంటలు (హెక్టార్లలో) 30,000
- వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
- కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, మోహనభాయి కాందా రియా సందర్శన
సాక్షి, హైదరాబాద్: కాలంగాని కాలంలో కురిసిన భారీ వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో రైతన్న కుదేలైపోయాడు.. వరి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు రూ.500 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయతో పాటు కేంద్ర వ్యవసాయ సహాయమంత్రి మోహనభాయి కాందారియా పర్యటించారు. నల్లగొండ జిల్లాలో నష్టపోయిన పంటలను వెంకయ్య, మోహనభాయి కాందారియా, కరీంనగర్ జిల్లాలో బండారు దత్తాత్రేయ పరిశీలించారు. అలాగే పంట నష్టం అంచనాకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసన్.. రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని సహా ఇతర అధికారులను కలిశారు. పర్యటన అనంతరం పంట నష్టంపై ప్రధాని మోదీకి నివేదిక అందజేస్తామని, అనంతరం రాష్ట్రానికి సాయంపై నిర్ణయం తీసుకుంటారని కేంద్ర ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.
40వేల హెక్టార్లలో..: ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40,131 హెక్టార్లలో వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఇక 30 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రకటించింది. మొత్తంగా చూస్తే.. వరి 26,632 హెక్టార్లలో, నువ్వులు 7,806, సజ్జలు 3,230, మొక్కజొన్న 1,474, జొన్న 933, పెసర పంటకు 51 హెక్టార్లలో నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని ప్రకటించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో అన్ని పంటలు కలిపి 15,403 హెక్టార్లలో దెబ్బతిన్నాయని... నల్లగొండ జిల్లాలో 11,969 హెక్టార్లు, నిజామాబాద్ జిల్లాలో 7,039 హెక్టార్లలో నష్టం జరిగిందని చెప్పారు. ఇక ఉద్యాన పంటల్లో ప్రధానంగా మామిడికి 15 వేల హెక్టార్లలో నష్టం జరిగిందని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.
‘బీమా’ అందేనా..?
భారీగా పంట నష్టం జరిగినా... రైతులకు ఏమేరకు బీమా అందుతుందో కూడా వ్యవసాయశాఖలోని బీమా విభాగం అధికారులు అంచనా వేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నష్టపోయిన రైతుల్లో ఎంతమంది రైతులు రబీలో ప్రీమియం చెల్లించారో కూడా లెక్కలు లేకపోవడం దారుణం. ఇక ఉద్యానశాఖలో రైతులు రూ.56 లక్షల మేరకు ప్రీమియం చెల్లించినా... బీమా సంస్థ అధికారులు పంట నష్టంవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఒక అధికారే పేర్కొనడం గమనార్హం. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యం: జిల్లాల్లోని అధికారులు మాత్రమే పంట నష్టపోయిన ప్రాంతాల్లో అక్కడక్కడా పర్యటిస్తున్నారు. కేంద్ర బృందంతో రాష్ట్రస్థాయి అధికారి ఒకరు మాత్రమే ఉన్నారు. వర్షాలు, నష్టాలు తమ పని కాదన్నట్లుగా.. అది పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం పని అన్నట్లుగా వ్యవసాయశాఖ అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం. కనీసం రాష్ట్రస్థాయిలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంలోనూ వ్యవసాయశాఖ విఫలమైంది. వ్యవసాయశాఖలోని ప్రకృతి వైపరీత్యాల విభాగం అధికారుల వద్ద ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఉండటం లేదు. మంత్రి కార్యాలయానికి కూడా తాజా సమాచారాన్ని అందించడంలేదన్న విమర్శలున్నాయి.
వర్షాలు తగ్గుముఖం
నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్తంత తగ్గుముఖం పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని.. ఆ తర్వాత కురవబోవని పేర్కొంది. గత 24 గంటల్లో అత్యధికంగా వరంగల్ జిల్లా తాడ్వాయిలో 5 సెంటీమీటర్లు, ఘన్‌పూర్‌లో 3.4, వెంకటాపూర్‌లో 2.4, అమ్రాబాద్‌లో 2.6, భూపాల్‌పల్లి, వెంకటాపురంలలో ఒక్కో సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది.
30% నష్టం జరిగినా పరిహారం: వెంకయ్య
భువనగిరి: ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు 30 శాతం పంటలను నష్టపోయినా పరిహారం చెల్లిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించాలన్న మోదీ ఆదేశం మేరకు తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నామన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల్లో కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి మోహన్‌భాయ్ కందారియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి ఇటీవలి వర్షాలకు నష్టపోయిన పంటలను వెంకయ్య పరిశీలించారు.
అనంతరం భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో 50 శాతం పంట నష్టం జరిగి తేనే పరిహారం ఇచ్చేవారన్నారు. అధికారులు గ్రామాల్లో నష్టం అంచనాలను తయారుచేసి పంచాయతీల వద్ద ఉంచాలన్నారు. తాము ప్రాథమిక అంచనాలను రూపొందించి ప్రధానికి నివేదిక అందిస్తామని, తర్వాత అధికారుల బృందం మళ్లీ నష్టం అంచనాలను సేకరిస్తుందన్నారు.
యుద్ధ ప్రాతిపదికన సాయం: దత్తాత్రేయ
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాలను బుధవారం పరిశీలించిన దత్తాత్రేయ.. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ పంట నష్టపరిహారాన్ని 50 శాతం మేరకు పెంచారని దత్తాత్రేయ పేర్కొన్నారు. రైతులను అన్నిరకాలుగా ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. వీలైనంత త్వరగా పరిహారం అంచనాలను రూపొందించి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల నుంచే పెంచిన పరిహారం అమల్లోకి వస్తున్నందున, అందుకు తగినట్లుగా అంచనాలను రూపొందించాలన్నారు.
రైతాంగాన్ని ఆదుకుంటాం: కేటీఆర్
జగిత్యాల: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగాపూర్, చల్‌గల్ , మేడిపెల్లి మండలం కట్లకుంట, కోరుట్ల మండలం జోగిన్‌పెల్లి, మాదాపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు, త్వరలోనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాథమిక సర్వే ప్రకారం దాదాపు 25 శాతం పంటలకు నష్టం జరిగిందని భావిస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో 12 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధంగా ఉందని ఈటెల రాజేందర్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లి, పెగడపల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు అధికారుల నివేదిక వచ్చిన తర్వాత 2 నెలల్లోగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలో దెబ్బతిన్న పంటలను మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. నివేదికలు అందిన వెంటనే పరిహారం అందిస్తామన్నారు.
వెంటనే వివరాలు సేకరించాలి: జానా, ఉత్తమ్
అకాల వర్షంతో దెబ్బతిన్న పంటల వివరాలను 24 గంటల్లో పూర్తిస్థాయిలో సేకరించాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్‌లో వానకు దెబ్బతిన్న వరి పంట, మామిడి తోటలను వారు బుధవారం పరిశీలించారు.
వర్ష బీభత్సానికి రైతులు నష్టపోయి 2 రోజులైనా.. వారికి భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫల మైందన్నారు. ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.