పేలుడుకు బాధ్యులెవరు? | 4 injured in blast near police station in Pune, ATS to probe | Sakshi
Sakshi News home page

పేలుడుకు బాధ్యులెవరు?

Published Fri, Jul 11 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

4 injured in blast near police station in Pune, ATS to probe

 పింప్రి, న్యూస్‌లైన్:  ఫరస్కానా పోలీస్ స్టేషన్ వద్ద గురువారం జరిగిన బాంబు పేలుడుకు కారణం ఎవరనే విషయమై స్పష్టత రావడం లేదు. దగుడుసేఠ్ హల్వాయి గణపతి దేవాలయం తీవ్రదాడుల హిట్‌లిస్టులో ఉన్నప్పటికీ, తాజా బాంబు పేలుడు అంత తీవ్రమైనది కాకపోవడంతో దీనికి బాధ్యులెవరే దానిపై స్పష్టత కొరవడింది. ఈ పేలుడు కేవలం ఒకరిని లక్ష్యంగా చేసుకుని జరిపారా అన్న సందేహాలూ కలుగుతున్నాయి.

 పుణే నగర క్రైంబ్రాంచ్‌లో పని చేస్తున్న ఒక పోలీసు అధికారి నక్సల్ హిట్ లిస్టులో ఉన్నారు. ఈ అధికారి గురువారం దగుడుసేఠ్ గణపతి ఆలయ దర్శనానికి వెళ్లే ముందు తన మోటార్ సైకిల్‌ను ఫరస్కానా పోలీసు స్టేషన్ ఆవరణంలో పెట్టారు. ఆయనకు భద్రతగా స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బందితోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. సదరు అధికారి ఆలయం నుంచి వెళ్లిపోయిన వెంటనే ఈ పేలుడు జరగడంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 పేలుడుకు ఉపయోగించిన వాహనం పోలీసుదే
 పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ సాతారాలో పనిచేసే కానిస్టేబుల్ దాదా బాబురావుదని గుర్తించారు. అయితే ఈ బైకు సాతారా కోర్టు వద్ద గత నెల 25న చోరీ అయింది. దీనిని దొంగిలించిన వారిని గుర్తించేందుకు సాతారా-పుణే ప్రాంతాల మధ్య ఉన్న టోల్‌నాకాల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల వీడియోలను పరిశీలిస్తున్నారు. కోరేగాల్ పార్క్ పరిసరాలలోని జర్మన్ బేకరిలో 2010, ఫిబ్రవరి 13న జరిగిన బాంబు పేలుడు పేలుళ్లలో 17 మంది మృతి చెందగా, 52 మంది గాయపడ్డారు. 2012లో ఆగస్టులో డెక్కన్ జంగ్లీ మహరాజ్ మార్గంలో జరిగిన బాంబు పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్‌దే బాధ్యత అని తేలింది.  

 గణేష్ ఉత్సవాలకు ముందే సీసీటీవీల ఏర్పాటు : మంత్రి పాటిల్
 పేలుడు సమాచారం తెలిసిన వెంటనే హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ కేసును ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్)కు అప్పగించామని ప్రకటించారు. గణేష్ ఉత్సవాలకు ముందుగానే నగరంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నగర ప్రజలు ధైర్యంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా అనుమానపు కదలికలు కనిపించిన వెంటనే     పోలీసులకు తెలపాలని కోరారు. డీజీపీ సంజీవ్ దయాళ్, సీనియర్ పోలీసు అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

 ఈ పేలుడు ఉగ్రవాద చర్యేనని ఏటీఎస్ ప్రకటించింది. ఈ మేరకు సెక్షన్ 324, 120 (బీ) ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. దర్యాప్తు కోసం పది బృందాలు పనిచేస్తున్నాయని, ఘటనాస్థలం నుంచి అన్ని ఆధారాలూ సేకరించామని వెల్లడించింది. ఇదిలా ఉంటే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కూడా శుక్రవారం ఘటనాస్థలాన్ని సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement