ప్రభుత్వ పాఠశాలలపై ఇది వరకే ప్రజల్లో చిన్నచూపు ఉంది. అక్కడ సౌకర్యాలు, అధ్యాపకుల కొరత ఎక్కువని, టీచర్లున్నా సరిగా బోధించరన్న అపవాదు ఉంది.
భివండీ, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలలపై ఇది వరకే ప్రజల్లో చిన్నచూపు ఉంది. అక్కడ సౌకర్యాలు, అధ్యాపకుల కొరత ఎక్కువని, టీచర్లున్నా సరిగా బోధించరన్న అపవాదు ఉంది. అయినప్పటికీ కొందరు తల్లిడండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. అయితే చాలా స్కూలు భవనాలు పాతకాలం నాటికి కావడంతో కుప్పకూలుతున్నాయి. భివండీలోని మహానగర్ పాలిక పద్మనగర్ తెలుగు మాధ్యమిక పాఠశాలలోని 8వ తరగతి గది మంగళవారం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ ఘటనలో 40 మంది పిల్లలు గాయపడ్డారు.
వీరిలో ఎనిమిది మందికి తీవ్రగాయాలు కావడంతో ఇందిరాగాంధీ ఆస్పత్రికి తరలించారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ స్కూల్లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు నడుస్తుండేవి. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎనిమిదేళ్ల కిందట మరో భవనాన్ని నిర్మించి తరగతులను ఇందులోకి మార్చారు. అయితే అప్పటి వరకు ఉన్న స్కూలు పాత భవనాలను ప్రభాగ్ సమితి-3 కార్యాలయంగా వినియోగించారు. ఆ తరువాత సమితి కార్యాలయానికి కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ పాత భవనాలకు మరమ్మతులు చేయకుండానే ఉదయం మాధ్యమిక పాఠశాలను, మధ్యాహ్నం హిందీ, మరాఠీ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఈ తెలుగు పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు సుమారు 800 మంది చదువుతున్నారు. మంగళవారం ఉదయం 9.15 గంటలకు 8వ తరగతిలో సుమారు 80 మంది పిల్లలు ఉండగా, అకస్మాత్తుగా పైకప్పు కూలింది. దీనికి బిగించిన సీలింగ్ ఫ్యాన్ కూడా పిల్లలపై పడిపోయింది. దీంతో భీతిల్లిన విద్యార్థులంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. క్లాస్‌రూమ్‌లో ఉన్న సామల అరుణ, ఉపాధ్యాయురాలితో పాటు కొంత మంది విద్యార్థుల తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు.
అధికారులు చెప్పినా....
అయితే కార్పొరేషన్ ప్రభాగ్ సమితి సిటీ ఇంజనీర్ వాసిం షేక్ సోమవారమే తరగతి గదులను పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేసేవరకు తరగతులు నిర్వహించవద్దని ప్రధానోపాధ్యాయురాలు సోనాలిని ఆదేశించారు.అయినప్పటికీ మంగళవారం యథావిధిగా తరగతులు నిర్వహించారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల కూలడం గమనించిన ప్రభాగ్ సమితి కార్యాలయ సిబ్బంది వచ్చి బాధితులను ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలుగు విద్యార్థులు వేముల రవళి, చిలుక రాహుల్, వైట్ల శ్రావణి, వడ్లకొండ శివరామ్, బూర లావణ్య, ఉబ్బాస్ చంద్రశేఖర్, సూరం వినయ్, భైరి అక్షయ, చిదురాల ఉపేందర్, చేర్యాల మనోజ్, బేతి వినిత్, జొన్ను విక్రమ్, కుందారపు సువర్ణ, మదిరాల సుకన్య, కోనం దేవి, జొన్ను భూలక్ష్మీ, జల్జె శంకర్, పోరండ్ల విజయ, గాజంగి సంధ్య, వేల్ల శ్రావణ్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన కమిషనర్ జీవన్ సోనవాణే, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ విజయ్ కంఠే, ఇతర అధికారులను.. భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కార్యవర్గ సభ్యులు నిలదీశారు. పిల్లకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
స్కూల్లో అన్నీ అసౌకర్యాలే....
తెలుగు ప్రజలు అత్యధికంగా నివాసముండే పద్మనగర్ ప్రాంతంలోని ఈ స్కూల్లో మరమగ్గాల కార్మికుల పిల్లలే ఎక్కువ. ‘కేవలం ఐదుగురు టీచర్లతోనే స్కూలు నడుస్తున్నా సర్దుకుపోతున్నాం. ఇప్పుడు మా పిల్లల ప్రాణాలకే ముప్పు వచ్చింది. దీనికి బాద్యులు ఎవరు?’ అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం భోజనంలో పురుగులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉదయం దుర్ఘటన సంభవించాక డిప్యూటి మేయర్ మనోజ్ కాటేకర్, కార్పొరేటర్ మురళి మచ్చ, మహేశ్ చౌగులే, నిత్యానంద్ నాడార్ , సమాజ్ సేవకుడు సచ్చిన్ పాటిల్ వచ్చి విద్యార్థులను పరామర్శించారు.