నెత్తు'రోడ్డు'తోంది
* గతేడాది 5 లక్షల రోడ్డు ప్రమాదాలు
* 1.46 లక్షల మంది మృతి
* కొత్త చట్టంలో కఠిన నిబంధనలు: గడ్కారీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో రోజూ 400 మంది మృతిచెందుతున్నారని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కారీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో ముంబై (23,468), మరణాల్లో ఢిల్లీ (1,622) తొలిస్థానాల్లో ఉన్నాయన్నారు. రోడ్డుప్రమాదాల నివేదిక -2015ను మంత్రి గురువారం విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా గంటకు 57 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా... 17 మంది మరణిస్తున్నారు. మృతుల్లో 54 శాతం మంది 15-34 మధ్య వయసువారే. 2015లో మొత్తం 5 లక్షల ప్రమాదాలు సంభవించగా... 1.46 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 13 రాష్ట్రాల్లోనే 87.2 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఏపీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
వేగ పరిమితి దాటితే డ్రైవర్లను పట్టుకునేందుకు జాతీయ రహదారులపై కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించి వాహనాలకు అదనపు వస్తువుల్ని బిగిస్తే రూ.5వేల వరకూ జరిమానా విధించేలా కొత్త జాతీయ భద్రతా బిల్లును తెస్తామన్నారు. ఆ వస్తువుల డీలర్లు, తయారీదారులపై రూ. లక్ష వరకూ జరిమానా విధిస్తామన్నారు.