
ఇన్‌ఫార్మర్ల పేరిట హత్యల పరంపర
- ఇప్పటి వరకూ నక్సల్స్ చేతిలో 493 మంది హతం
- మహారాష్ట్రలో 1980 నుండి నక్సల్స్ కార్యకలాపాలు
గడ్చిరోలి : రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా నక్సల్స్ హత్యల పరంపర కొనసాగుతోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు, జిల్లాపరిషత్, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పలువురు సాధారణ పౌరులను సైతం పోలీస్ ఇన్‌ఫార్మర్ల పేరిట తీవ్రవాదులు హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. 1980 నుండి మహరాష్ట్రలో నక్సలైట్ ఉద్యమం ఊపందుకోంది. అప్పటి నుంచి గడ్చిరోలి, చంద్రాపూర్, గోండియా జిల్లాల్లో సుమారు 493 మంది నక్సల్స్ చేతిలో హత్యకు గురైనట్లు రాష్ట్ర నక్సల్స్ వ్యతిరేక పోలీసు విభాగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఒక్క గడ్చిరోలి జిల్లాలోనే అత్యధికంగా (451) మంది ఉన్నారు. గోండియాలో(33), చంద్రాపూర్‌లో(9) మంది హతులయ్యారు. ఫిబ్రవరి 1985 నుంచి జూలై, 2014 మధ్య కాలంలోనే నక్సలైట్లు ఎక్కువగా సాధారణ పౌరులను పొట్టనపెట్టుకున్నారని ఆ నివేదిక తెలిపింది. ఈ మూడు జిల్లాల్లో ఇన్‌ఫార్మర్ల పేరుతో 206 మంది,188 మంది సాధారాణ పౌరులు, 24 మంది పోలీస్ పటేళ్లు, 14 మంది లొంగిపోయిన నక్సల్స్, 5గురు మాజీ పోలీస్ పటే ళ్లను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
సిరోంచ దళం పేరుతో షురూ
నక్సలైట్ ఉద్యమం మొట్టమొదటి సారి గడ్చిరోలిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నదిని దాటి మహారాష్ట్రలోని సిరోంచ తాలుకాలోని లంకచేన్ గ్రామానికి విస్తరించింది. ఇక్కడ నుండి సిరోంచ దళం పేరుతో నక్సలైట్లు తమ కార్యకలాపాలను కొనసాగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం 260 మంది క్యాడర్ 17 నుండి 19 దళాలుగా గడ్చిరోలి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటిదాకా 10 మంది సాధారణ పౌరులను నక్సల్స్ హతమార్చినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్లతో తీవ్రవాదులకు గట్టి ఎదురె దెబ్బ తగిలింది. వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానీ, అంతకంతకూ నక్సలైట్లు ఆంధ్రప్రదేశ్ నుండి మహరాష్ట్రలోకి చొరబడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వారాన్ని నక్సల్స్ ‘అమరవీరుల వారోత్సవం’గా ప్రకటించారని పేర్కొన్నారు.