ప్రమాదం అనంతరం స్థానికుల నిరసన
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో ఆరుగురు బాలురు అక్కడిక్కడకే ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. మరొకరు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాదిక్ పూర్‌లోని హాపూర్ రైల్వే ట్రాక్‌పై ఆదివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది.
పెయింటర్లుగా పనిచేస్తున్న14-15వయసున్నఏడుగురు కార్మికులు పెయింటింగ్ కాంట్రాక్ట్ కోసం హైదరాబాద్ రావాల్సిఉంది . రైలు మిస్‌కావడంతో పిలిఖువాకు తిరిగి పయనమయ్యారు. అర్థరాత్రి సమయంలో ట్రాక్ దాటుతుండగా, రైలు ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే వారు ప్రాణాలు విడిచారు. చనిపోయన వారిలో విజయ్, ఆకాష్, రాహుల్, సమీర్, ఆరిఫ్, సలీం ఉన్నారు. మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ సంఘటన అనంతరం స్థానికులు రైల్వే ట్రాక్‌ఫై నిరసనకు దిగారు. ఈ మార్గం షార్ట్ కట్ కావడంతో వృద్ధులకు, పిల్లలు పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తారని పేర్కొన్నారు. నిరంతరం జనసంచారం ఉండే ఈ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవని ఆరోపించారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా ఎస్‌పీ హేమంత్ కుటియల్ సహా జిల్లా ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వీరంతా హెడ్ ఫోన్లలో మ్యూజిక్ వింటూ పట్టాలు దాటుతూ, రైలు వస్తున్న శబ్దాన్ని గమనించ లేదని ప్రత్యక్షసాక్షులు కొంతమంది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment