ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)పై 8.5 శాతం వడ్డీని చెల్లించాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించింది. ఈమేరకు సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది
నేడు వెలువడనున్న ప్రకటన
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)పై 8.5 శాతం వడ్డీని చెల్లించాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించింది. ఈమేరకు సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ నిర్ణయంతో 2013-14 సంవత్సరంలో ఐదుకోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి కలుగుతుంది. సోమవారం జరిగే ఈపీఎఫ్‌ఓ కేంద్రపాలక మండలి(సీబీటీ) సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓకు రూ.20,796.96కోట్ల ఆదాయం వచ్చింది. ఉద్యోగుల భవిష్యనిధి, బీమా పథకాలను నిర్వహించడానికి అయ్యే పాలనాపరమైన వ్యయాన్ని పెంచడంపైనా నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం నెలకు ఈపీఎఫ్ పథకానికి ఐదు రూపాయలు, బీమా పథకానికి రెండు రూపాయల వంతున పాలనాపరమైన ఖర్చులు వసూలు చేస్తున్నారు. ఈసారి వీటిని వరుసగా రూ.500, రూ.200గా పెంచాలని భావిస్తున్నారు. అంతేకాక సర్వీసు చార్జీలను కూడా పై రెండు పథకాలకు క్రమంగా రూ.75, రూ.25 వంతున వసూలు చేయాలని నిర్ణయించనున్నారు. ఏడాది తర్వాత సీబీటీ సమావేశం జరుగుతోంది.