వంద నోట్లు ఎందుకు ముద్రించలేదు?
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రీన్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు తాము ఇదే విషయాన్ని ఆయనతో చెప్పామన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయాలనుకున్నప్పుడు వంద రూపాయల నోట్లను అధికంగా ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. రూ. 500 నోట్లను మళ్లీ ఎందుకు కొత్తగా తీసుకొచ్చారని నిలదీశారు.
పెద్ద నోట్ల రద్దుతో అందరూ సంతోషంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారని, ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం 2 శాతం మందే నల్లధనం కలిగివున్నారని, నోట్ల రద్దుతో 98 శాతం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 90 శాతం మంది ప్రజలు డెబిట్ కార్డును డబ్బులు డ్రా చేసేందుకే ఉపయోగిస్తారని, కోనుగోళ్ల కోసం వాడడం లేదని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు సరే, మరి ఎన్నికల సంస్కరణలు ఎప్పుడని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తారా అని అడిగారు.