పెద్దనోట్ల రద్దుపై సభలో కీలక పరిణామం!
-
రేపు రాజ్యసభకు ప్రధాని మోదీ!
-
పెద్దనోట్లపై చర్చలో పాల్గొనే అవకాశం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాల నిరసన ప్రదర్శనలతో వరుసగా ఏడోరోజూ కూడా ఉభయసభలు వాయిదాపడ్డాయి. దీంతో సభలను సజావుగా నిర్వహించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, అనంత్‌కుమార్ ప్రతిపక్ష నేతలను బుజ్జగిస్తున్నారు. పలు ప్రతిపక్ష పార్టీ నేతలతో జైట్లీ, రాజ్‌నాథ్ బుధవారం చర్చలు జరిపినట్టు సమాచారం. అదేవిధంగా రాజ్‌నాత్ గురువారం ఉదయం పదిగంటలకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో భేటీ కానున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా గురువారం రాజ్యసభకు హాజరు అయ్యే అవకాశముందని తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దుపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారని సమాచారం.
పెద్దనోట్ల రద్దుపై జరిగే చర్చలో భాగంగా ప్రధాని మోదీ రాజ్యసభకు రావాలని, ఆయన ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దుపై తమ నిరసనను తీవ్రతరం చేసి సభలను విపక్షాలు అడ్డుకుంటుండటంతో ఈ ప్రతిష్టంభనను తొలగించి సభలను సజావుగా జరిగేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.