
బెంజ్ కారుపై అపర కాళిలా..
ఈవ్‌టీజింగ్‌పై యువతి ఆగ్రహం
ఆగ్రా: ఈవ్‌టీజింగ్‌పై ఓ యువతి అపరకాళి అవతారం ఎత్తింది. ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సమాజ్‌వాదీ పార్టీ నేత గన్‌మన్ తనకు కన్నుకొట్టడమేకాక వెకిలివేషాలేయడంతో మెర్సిడెస్ బెంజ్ కారు బానెట్ పెకైక్కి శివతాండవం చేసింది. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుకుంది. ఆ రోజు సాయంత్రం సాధ్వీ పాండే (23) తన సోదరితో కలసి స్కూటీపై వెళుతూ ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. ఎస్‌పీ నేత అభినవ్ శర్మ బెంజ్ కారు వీరి పక్కనే ఆగింది. కారులో ఉన్న శర్మ గన్‌మన్.. సాధ్వీని చూసి కన్నుకొట్టడమే కాక వెకిలి సంజ్ఞలు చేశాడు. దీంతో కారును ఆపేసిన సాధ్వీ.. తన మొబైల్‌తో గన్‌మన్ ఫొటో తీసేందుకు ప్రయత్నించింది. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆమె మొబైల్‌ను లాక్కుని నేలకేసి కొట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన సాధ్వీ.. శర్మ బెంజ్ కారు బానెట్‌పైకి ఎక్కి.. దానిపై ఉన్న సమాజ్‌వాదీ పార్టీ జెండాను లాగేసి దానితోనే విండ్‌షీల్డ్స్(కారు అద్దాలు) ధ్వంసం చేసింది. పోలీసులు శర్మను, గన్‌మన్‌ను అక్కడి నుంచి పంపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
యువతి కారు అద్దాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు ఎక్కడంతో ఆమె తెగువపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో తన గొప్పతనం ఏమీ లేదని, కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న వస్తువును పగలగొడితే మీరైనా ఇలాగే స్పందిస్తారని సాధ్వీ చెప్పింది. వారు తన మొబైల్‌ను పగలగొట్టకుండా.. గన్‌మన్‌పై చర్య తీసుకుని ఉంటే తాను ఇంతగా స్పందించేదాన్ని కాదంది. శర్మ తన తండ్రి తమ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పి, తమకు జరిగిన నష్టానికి పరిహారం అందించారని చెప్పింది. మరోవైపు పక్కకు తప్పుకోవాలని మాత్రమే కోరానని తన గన్‌మన్ చెపుతున్నాడని, అయినా అతడిని విధులనుంచి తొలగించినట్టు శర్మ చెప్పాడు. గన్‌మన్ అసభ్యంగా ప్రవర్తించాడని యువతి తనతో చెప్పివుంటే అతడిని అక్కడికక్కడే కొట్టేవాడినని, కానీ ఆమె తన కారును ధ్వంసం చేసిందన్నాడు. ఎస్‌పీ నేత నరేశ్ అగర్వాల్ స్పందిస్తూ.. అభినవ్ తమ పార్టీ నేత కానే కాదని, యూపీలో అధికార పార్టీ జెండాను కారుపై పెట్టుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిందని పేర్కొన్నాడు.