
ఫిర్యాదు చేస్తే వెకిలి నవ్వులు.. కేంద్ర మంత్రి ఫైర్
ముంబయి: ముంబయి లోకల్ రైలులో ఓ 22 ఏళ్ల విద్యార్థినిపట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. కళ్లతో సైగలు చేయడంతోపాటు వెకిలిచేష్టలు చేస్తూ చెప్పరాని విధంగా చేశాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా రైల్వే పోలీసులు కంప్లెయిట్ తీసుకోకపోగా వెకిలి నవ్వులు నవ్వడం మొదలుపెట్టారు. దీంతో తాను ఎదుర్కొన్న భయానక సంఘటనను ఫేస్‌బుక్ ద్వారా ఆమె సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. ఘటన విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని, సదరు పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ట్వీట్ కూడా చేశారు.
బాధితురాలు ఫేస్‌బుక్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. మరో ప్రయాణీకురాలితో కలిసి ఆమె ప్రత్యేక మహిళల రైలు బోగీలో కూర్చొని ఉంది. మరో బోగీకి వీరు కూర్చున్న బోగీకి మధ్య ఇనుప రెయిలింగ్ అడ్డుగా ఉంది. అవతలి బోగీలో ఉన్న ఉన్న వ్యక్తి ఆమె పక్కనే ఉన్న మహిళకు చేయి ఊపడం గమనించింది. అయితే, తొలుత ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని అనుకున్నారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం తన చేష్టలు ఆపకుండా నోటితో చెప్పలేని విధంగా చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించాడు. అనంతరం వారిద్దరిని ఇబ్బందికరంగా తిట్టడమే కాకుండా లైంగిక దాడి చేస్తానంటూ బెదిరించాడు. ఇదే విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు కేసు నమోదు చేసుకోకపోగా వారిని చూసి నవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆమె సోషల్ మీడియాను ఆశ్రయించినట్లు తెలిపింది.