న్యూఢిల్లీ: విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఆదాయ పన్ను శాఖ రూ.30 కోట్ల పన్ను నోటీసులు జారీచేసింది. 2015–16 ఏడాదికి గాను ఆ పార్టీకి ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేసింది. డిల్లీలోని ఓ హవాలా వ్యాపారి నుంచి ఆప్ రూ.2 కోట్ల నగదు స్వీకరించి, దాన్ని స్వచ్ఛంద విరాళమని తప్పుగా చూపిందని ఐటీ విభాగం ఆరోపించింది.
విదేశాల నుంచి సేకరించిన విరాళాలను దాచిపెట్టడంపై వివరణ ఇవ్వాలని చాలాసార్లు కోరినా ఆప్ స్పందించలేదని వెల్లడించింది. 2015–16లో పన్ను వేయదగిన ఆ పార్టీ మొత్తం ఆదాయం రూ.68.44 కోట్లు, కట్టాల్సిన పన్ను రూ.30.67 కోట్లని నిర్ధారించింది. ఈ చర్యపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘ ఖాతా పుస్తకాల్లో స్పష్టంగా చూపినా కూడా మా పార్టీకి వచ్చిన నిధులన్నీ అక్రమమని తేల్చారు. రాజకీయ వేధింపులు తారాస్థాయికి చేరాయనడానికి ఇదే నిదర్శనం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment