Collection of donations
-
ఆప్‌కు ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఆదాయ పన్ను శాఖ రూ.30 కోట్ల పన్ను నోటీసులు జారీచేసింది. 2015–16 ఏడాదికి గాను ఆ పార్టీకి ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేసింది. డిల్లీలోని ఓ హవాలా వ్యాపారి నుంచి ఆప్ రూ.2 కోట్ల నగదు స్వీకరించి, దాన్ని స్వచ్ఛంద విరాళమని తప్పుగా చూపిందని ఐటీ విభాగం ఆరోపించింది. విదేశాల నుంచి సేకరించిన విరాళాలను దాచిపెట్టడంపై వివరణ ఇవ్వాలని చాలాసార్లు కోరినా ఆప్ స్పందించలేదని వెల్లడించింది. 2015–16లో పన్ను వేయదగిన ఆ పార్టీ మొత్తం ఆదాయం రూ.68.44 కోట్లు, కట్టాల్సిన పన్ను రూ.30.67 కోట్లని నిర్ధారించింది. ఈ చర్యపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘ ఖాతా పుస్తకాల్లో స్పష్టంగా చూపినా కూడా మా పార్టీకి వచ్చిన నిధులన్నీ అక్రమమని తేల్చారు. రాజకీయ వేధింపులు తారాస్థాయికి చేరాయనడానికి ఇదే నిదర్శనం’ అని ఆయన ట్వీట్ చేశారు. -
సెల్ఫీ దిగాలంటే..‘పేటీఎం’ చేయాల్సిందే!
వినూత్న రీతిలో ఓ కళాకారుడి విరాళాల సేకరణ హైదరాబాద్: భుజాన క్రికెట్ బ్యాట్‌తో హుషారుగా మెట్లు దిగుతున్న ఇతని పేరు నూకాజీ. చదువుకున్నది గ్రాడ్యుయేషన్. అయినా కళల పట్ల మక్కువతో దాన్నే జీవనాధారంగా చేసుకున్నాడు. ఇటీవల ఏర్పడిన నగదు కొరతతో రాబడి తగ్గిపోవడంతో ఓ ఉపాయంగా ‘పేటీఎం’ద్వారా ఆన్లైన్ విరాళాలు స్వీకరిస్తున్నాడు. ప్రతి ఆదివారం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నెక్లెస్ రోడ్డులో ఇలా వివిధ వేషధారణలతో పేటీఎం ట్యాగ్‌తో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తు్తన్నాడు. ఇతనితో దిగే మొదటి సెల్ఫీ ఉచితం. తరువాత దానికి మాత్రం పేటీఎం ద్వారా పేమెంట్ చేయాల్సిందే. మూసాపేట మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం కనిపించిన దృశ్యం ఇది.. -
విరాళాల సేకరణలో శివసేన ‘టాప్’
న్యూఢిల్లీ: 2015–16 ఏడాదికి అత్యధిక మొత్తం విరాళాలను సేకరించిన ప్రాంతీయ పార్టీగా శివసేన నిలిచింది. ప్రాంతీయ పార్టీలు 2015–16 సంవత్సరంలో సేకరించిన విరాళాలకు సంబంధించి ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్‌ల సంయుక్త నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల మొత్తం రూ.107.62 కోట్లు. ఇది విరాళాల వివరాలను బహిర్గతం చేసిన పార్టీలకు సమకూరిన మొత్తం మాత్రమే. 26 ప్రాంతీయ పార్టీలు తమకొచ్చిన విరాళాల వివరాలను చెప్పలేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం పార్టీలు 100 శాతం పన్ను మినహాయింపు పొందాలంటే రూ.20 వేలు, ఆపై మొత్తంలో వచ్చే విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. నివేదిక ప్రకారం 2015–16లో శివసేనకు రూ.86.8 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 6.6 కోట్లు విరాళాలుగా వచ్చాయి. అన్ని ప్రాంతీయ పార్టీల మొత్తం విరాళాల్లో శివసేన వాటా 81 శాతం ఉంది. 1,187 మంది వ్యక్తులు/కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించిన ఆప్..ఎక్కువ సంఖ్యలో విరాళాలు వచ్చిన పార్టీగా నిలిచింది. విరాళాల వివరాలను ప్రకటించని పార్టీల్లో ఏఐఏడీఎంకే, బీజేడీ, జేఎంఎం, ఎన్పీఎఫ్, ఆర్ఎల్డీ తదితరాలు ఉన్నాయి. -
టీవీ ఆర్టిస్టుల బైక్ ర్యాలీ
పాల్గొన్న మేయర్ నన్నపునేని, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కార్పొరేటర్లు హరితహారం గ్రీన్‌ఫండ్ కోసం రూ.3,78,116 విరాళాల సేకరణ హన్మకొండ : హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బుల్లితెర కళాకారులతో కలిసి కార్పొరేటర్లు, టీఆర్ఎస్ శ్రేణులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 50వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీని కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి క్రాస్ రోడ్డు వద్ద గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించారు. టీవీ ఆర్టిస్టులు విజయ్, లోహిత్, అభినవ్ సర్దార్, మున్నా ఫేం శ్రీధర్‌రావు, సై ఫేం షైన్ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్నేహనగర్‌లోని వంద ఫీట్ల రోడ్డులో మొక్కలు నాటి, హరితహారం గ్రీన్‌ఫండ్ కోసం విరాళాలు సేకరించారు. అనంతరం కాలనీలో నిర్వహించిన సమావేశంలో మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. గ్రీన్‌ఫండ్ కోసం కళాకారుడు హైదరాబాద్ తల్వార్ రూ.51వేలు విరాళంగా ప్రకటించారు. కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన పది నెలల జీతాన్ని గ్రీన్‌ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. స్నేహనగర్ అభివృద్ధి కమిటీ రూ.లక్ష, తెలంగాణ జాగృతి మహిళా విభాగం అర్బన్ కన్వీనర్ అనితారెడ్డి రూ.లక్ష, రాజిరెడ్డి, బాలగౌడ్ కలిసి రూ.51 వేలు, రిటైర్డ్ టీచర్ వెంకటేశ్వర్లు రూ.11 వేలు, వెంకన్న రూ.5,116 విరాళాలుగా అందించారు. మెుత్తంగా రూ.3,78,116 విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు నక్క లింగయ్య, ఆకుల మధుకర్, సతీష్, పులి సారంగపాణి, మనోహర్‌రావు, పాకనాటి మోహన్‌రెడ్డి, రాంప్రసాద్, కోగిల మహేష్, నర్సింగరావు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.