విరాళాల సేకరణలో శివసేన ‘టాప్’
న్యూఢిల్లీ: 2015–16 ఏడాదికి అత్యధిక మొత్తం విరాళాలను సేకరించిన ప్రాంతీయ పార్టీగా శివసేన నిలిచింది. ప్రాంతీయ పార్టీలు 2015–16 సంవత్సరంలో సేకరించిన విరాళాలకు సంబంధించి ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్‌ల సంయుక్త నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల మొత్తం రూ.107.62 కోట్లు. ఇది విరాళాల వివరాలను బహిర్గతం చేసిన పార్టీలకు సమకూరిన మొత్తం మాత్రమే. 26 ప్రాంతీయ పార్టీలు తమకొచ్చిన విరాళాల వివరాలను చెప్పలేదు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం పార్టీలు 100 శాతం పన్ను మినహాయింపు పొందాలంటే రూ.20 వేలు, ఆపై మొత్తంలో వచ్చే విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. నివేదిక ప్రకారం 2015–16లో శివసేనకు రూ.86.8 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 6.6 కోట్లు విరాళాలుగా వచ్చాయి. అన్ని ప్రాంతీయ పార్టీల మొత్తం విరాళాల్లో శివసేన వాటా 81 శాతం ఉంది. 1,187 మంది వ్యక్తులు/కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించిన ఆప్..ఎక్కువ సంఖ్యలో విరాళాలు వచ్చిన పార్టీగా నిలిచింది. విరాళాల వివరాలను ప్రకటించని పార్టీల్లో ఏఐఏడీఎంకే, బీజేడీ, జేఎంఎం, ఎన్‌పీఎఫ్, ఆర్‌ఎల్‌డీ తదితరాలు ఉన్నాయి.