మూడు నెలల్లో రూ. 15 కోట్ల ఖర్చు!
సామాన్యుడి ప్రభుత్వం తన ప్రచార కార్యక్రమాలకు భారీగా ఖర్చుపెడుతోంది. గడిచిన మూడు నెలల్లో ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు ఏకంగా రూ. 15 కోట్లు వెచ్చించింది. ఈ విషయం సమాచార హక్కు దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో తేలింది. అయితే.. కేవలం ఢిల్లీలో వెలువడే పత్రికలు, ఇతర జాతీయ పత్రికలకే కాకుండా.. కేరళ, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన స్థానిక పత్రికలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం గమనార్హం.
ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మే 11 వరకు టీవీ ప్రకటనలు కాకుండా మిగిలిన ప్రకటనలకు మాత్రమే రూ. 14.56 కోట్లు ఖర్చుపెట్టిందని ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో ఉంది. అమన్ పన్వర్ అనే న్యాయవాది ఈ దరఖాస్తు చేశారు. ఆప్ సర్కారు ప్రచారకండూతిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటూనే మరోవైపు సొంత ప్రచారం కోసం ఇంత పెద్దమొత్తంలో ఖర్చుపెట్టడం ఏంటని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ప్రశ్నించారు. రెండు దశలుగా అమలుచేసిన సరి-బేసి విధానంపై ప్రచారం కోసమే ఢిల్లీ ప్రభుత్వం రూ. 5 కోట్లు ఖర్చుపెట్టింది.