న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ప్రయత్నంలోనే 28 స్థానాలను గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), మరో 20 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది.
రాజకీయ, సినీ వర్గాల నుంచి ప్రశంసలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ప్రయత్నంలోనే 28 స్థానాలను గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), మరో 20 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గాల్లో ‘ఆప్’ నామమాత్రపు ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆర్‌కే పురం నుంచి ‘ఆప్’ అభ్యర్థి షాజియా ఇస్లామీ తన బీజేపీ ప్రత్యర్థి అనిల్‌కుమార్ శర్మ చేతిలో కేవలం 326 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సుల్తాన్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జైకిషన్ కేవలం 1,100 ఓట్ల తేడాతో ‘ఆప్’ అభ్యర్థిపై గెలుపొందారు. బిజ్‌వాసన్, ద్వారక, కల్కాజీ, త్రినగర్ నియోజకవర్గాలను ‘ఆప్’ 2 వేల నుంచి 3 వేల ఓట్ల తేడాతో జారవిడుచుకుంది. దక్షిణ ఢిల్లీ, గ్రేటర్ కైలాస్, కస్తూర్బానగర్, సంఘం విహార్, అంబేద్కర్‌నగర్, దియోలీ నియోజకవర్గాల్లో బీజేపీకి దాదాపు సమ ఉజ్జీగా నిలిచింది.
కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ: కేజ్రీవాల్ నేతృత్వంలో ‘ఆప్’ సాధించిన ఫలితాలకు బాలీవుడ్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. భారీ తారాగణం లేకుండానే సూపర్‌హిట్ అయిన చిత్రం మాదిరిగా ‘ఆప్’ కూడా ఎన్నికల్లో హిట్ అయ్యిందంటూ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించారు. ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్‌కు ఉత్తమ తొలి ప్రదర్శన అవార్డు ఇవ్వాలని బాలీవుడ్ నటి ప్రీతీ జింటా వ్యాఖ్యానించారు. రచయిత చేతన్ భగత్ ఢిల్లీ ఫలితాలను ‘ఆప్’ నైతిక విజయంగా అభివర్ణించారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షమైన శివసేన సైతం కేజ్రీవాల్‌పై ప్రశంసలు కురిపించింది.