
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులకు ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు గురువారం ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషిలుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపినట్లు ఆధారాలు లేవని, ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని కోర్టు పేర్కొంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద న్యాయస్థానం ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటించింది.
కాగా పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులు ప్రస్తుతం ఘజియాబాద్‌లోని దస్నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు అలహాబాద్ హైకోర్టు తీర్పును ఆరుషి తాత స్వాగతించారు. రాజేశ్, నూపుర్ తల్వార్ ఎలాంటి తప్పు చేయలేదని తమకు తెలుసు అని ఆయన అన్నారు.