
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశ విదేశాల్లో శిక్షణ ఇచ్చేందుకు, అందుకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 2018–19 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.192 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో రూ.75.35 కోట్లతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ అండ్ మేనేజ్‌మెంట్(ఐఎస్‌టీఎం), లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) సంస్థల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు.
ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ ఆధునీకరణకు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఐఎస్‌టీఎంను అభివృద్ధి చేసేందుకు మిగిలిన రూ.116.75 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా, గతేడాది ఈ శాఖకు రూ.194.3 కోట్లను కేటాయించిన సంగతి విదితమే. దీంతో పాటు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డుకు రూ.26.54 కోట్లు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్(క్యాట్)కు రూ.111.86 కోట్లు కేటాయించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)కు రూ. 286.13 కోట్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల నివాస సముదాయాల నిర్మాణానికి అడ్వాన్స్‌గా రాష్ట్రాలకు రూ.1.65 కోట్లు కేటాయించారు.