అక్కడ ‘హక్కుల’ ఊసెత్తితే జైలే గతి! | Activists who visited Maoist-hit bastar in Chhattisgarh arrested under security act | Sakshi
Sakshi News home page

అక్కడ ‘హక్కుల’ ఊసెత్తితే జైలే గతి!

Published Wed, Mar 8 2017 7:47 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

అక్కడ ‘హక్కుల’ ఊసెత్తితే జైలే గతి! - Sakshi

అక్కడ ‘హక్కుల’ ఊసెత్తితే జైలే గతి!

‘బస్తర్‌’లో పోలీసుల జబర్దస్తీ
- ఛత్తీస్‌గఢ్‌ జైలులో తెలంగాణ హక్కుల నేతల బృందం
- ఎన్‌కౌంటర్లు, అత్యాచారాలపై నిజనిర్ధారణ కోసం పయనం
- భద్రాచలంలోనే అరెస్ట్.. ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగింత!
- మావోయిస్టులకు సాయం చేస్తున్నారంటూ అభియోగాలు
- 13 ఏళ్ల బాలుడి ‘ఎన్కౌంటర్’ నిజనిర్ధారణను అడ్డుకున్న వైనం
- ఆ ఎన్కౌంటర్పై కేసు వేసిన న్యాయవాదికీ బెదిరింపులు
- అంతకుముందు నందినీ సుందర్పైనా హత్య కేసు నమోదు
- ఇద్దరు పాత్రికేయుల అరెస్టులు.. మరికొందరికి వేధింపులు


(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
తెలంగాణకు చెందిన న్యాయవాదులు, పాత్రికేయులతో కూడిన ఏడుగురు హక్కుల కార్యకర్తలు గత మూడు నెలలుగా ఛత్తీస్‌గఢ్ జైలులో మగ్గుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు, అత్యాచారాల ఘటనలపై నిజనిర్ధారణ కోసం తెలంగాణ ప్రజాస్వామిక వేదికకు చెందిన ఈ ప్రతినిధి బృందం డిసెంబర్ 24వ తేదీన ఛత్తీస్‌గఢ్‌ బయలుదేరింది. అయితే.. 26వ తేదీన వారిని నిర్బంధించిన ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు.. మావోయిస్టులకు సాయం చేస్తున్నారన్న ఆరోపణలతో కోర్టులో హాజరుపరిచగా.. కోర్టు వారికి జ్యుడీషియల్‌ రిమాండు విధించి సుకుమా జైలుకు పంపించింది. బెయిల్‌ దరఖాస్తులనూ తిరస్కరించింది. జనవరిలో కూడా వారి బెయిల్‌ దరఖాస్తులను దంతెవాడ జిల్లా కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఎఫ్‌ఐఆర్ నకలు కానీ, వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్న వస్తువల వివరాలు, పంచనామా నివేదికలు కానీ డిఫెన్స్‌ న్యాయవాదులకు ఇవ్వలేదు. ప్రస్తుతం హైకోర్టులో వారి బెయిల్‌ పిటిషన్‌ విచారణలో ఉంది.

హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ (36), ఆదివాసీ తుడుం దెబ్బ ఖమ్మం కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య (45), హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయులు బి.ప్రభాకర్‌ రావు (52), రాజేంద్రప్రసాద్ (28), హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్‌రావు (48), బి.రవీంద్రనాథ్‌ (42), ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు మొహమ్మద్‌ నిజామ్లు ఉన్నారు.  నిజానికి.. హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఈ బృందాన్ని 25వ తేదీన భద్రాచలం జిల్లా దుమ్ముగూడెం గ్రామంలో తెలంగాణ పోలీసులే నిర్బంధించారని, తర్వాత వారిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు అప్పగించారని తెలంగాణ పౌర హక్కుల సంఘాలు  ఆరోపించాయి. వీరు ఏడుగురూ మావోయిస్టు పార్టీకి సాయం చేస్తున్నారని, వాళ్లు ప్రయాణిస్తున్న నాలుగు మోటారు సైకిళ్లు, రూ. లక్ష విలువైన రద్దు చేసిన నోట్లు, మొబైల్‌ ఫోన్లు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఆరోపించారు. నక్సలైట్ల కోసం పాత కరెన్సీని మార్చి ఇస్తున్నారని, మావోయిస్టులకు సాయం చేయాలని స్థానికులపై ఒత్తిడి తెస్తున్నారని అభియోగాలు మోపారు.

నిజానికి.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ముఖ్యంగా బస్తర్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బూటకపు ఎన్‌కౌంటర్లు, పోలీసుల దౌర్జన్యాలు, గిరిజన మహిళలపై అత్యాచారాల ఉదంతాలపై గళమెత్తుతున్న హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులపై ఏడాది కాలంగా పోలీసుల వేధింపులు పెరుగుతున్నాయని వివిధ ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హక్కుల గురించి మాట్లాడినా, అత్యాచారాల గురించి కథనాలు రాసినా.. హక్కుల నేతలు, పాత్రికేయులపై తప్పుడు కేసులు మోపడం పరిపాటిగా మారిందని పలు సంఘటనలను ఉదహరిస్తూ కేంద్ర మానవ హక్కుల కమిషన్‌, సుప్రీంకోర్టులకు కూడా లేఖలు రాశాయి.

13 ఏళ్ల బాలుడి ‘ఎన్కౌంటర్’ కేసు: వాస్తవానికి 2016 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాల ‘ఎన్‌కౌంటర్’లలో 134 మంది చనిపోయారు. ఆ బలగాలు లైంగిక హింసకు పాల్పడిన మూడు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బృందం నిజనిర్ధారణ పర్యటనలో భాగంగా.. బీజాపూర్ జిల్లా మెటపల్ గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడు సోమారు పొట్టం ‘ఎన్‌కౌంటర్‌’ మరణానికి సంబంధించి కూడా పరిశీలించనుంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు డిసెంబర్ 16న 13 ఏళ్ల బాలుడు సోమారును పట్టుకొని చంపేసి, మావోయిస్టుగా ముద్రవేశారని బిలాస్‌పూర్ హైకోర్టులో బాలుడి తండ్రి పిటిషన్ వేశారు. అతడిని పోలీసులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారని, గ్రామస్తులందరూ చూస్తుండగా అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని బయటికి తీసి మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని బిలాస్‌పూర్‌ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 25, 26 తేదీల్లో నిర్వహించారు.

న్యాయవాదల అరెస్టులు, బెదిరింపులు: ఈ కేసులో నిజనిర్ధారణ చేయనున్న టీడీఎఫ్‌ బృందాన్ని ముందుగానే అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. అంతేకాదు.. వీరిని అరెస్ట్ చేసిన సమయంలోనే.. జగదల్‌పూర్‌ న్యాయ సహాయ బృందానికి చెందిన శాలినీ గేరా అనే న్యాయవాది.. మావోయిస్టులకు రూ. 10 లక్షల కొత్త నోట్లు మార్చినట్లు, ఆమె దంతెవాద అడవుల్లో మావోయిస్టులను కలిసినట్లు తమకు ఫిర్యాదు అందిందంటూ.. బస్తర్‌ ఎస్‌పీ ఆర్‌.ఎన్‌.దాష్ ఆమెకు ఫోన్‌ చేసి బెదిరించారు. డిసెంబర్ 26వ తేదీన ఒక ఎస్ఐ ఆమె బసచేసిన ప్రాంతానికి వెళ్లి ఆమె గదిని సోదా చేయాలని, విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు రావాలని బెదిరించారు. ఆమె ఎవరో కాదు.. పోలీసుల చేతుల్లో హతమైన 13 ఏళ్ల బాలుడి ఎన్‌కౌంటర్‌పై అతడి తల్లిదండ్రుల తరఫున హైకోర్టులో పిటిషన్‌ వేసిన న్యాయవ్యాది. ఆ బాలుడి మృతదేహానికి మళ్లీ పోస్ట్‌ మార్టం నిర్వహిస్తుండగా దానిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రభుత్వ అధికారులతో కలిసి ఉన్న ఆమెకూ బెదిరింపులు తప్పలేదు.

ప్రముఖ ప్రొఫెసర్లకూ కేసుల వేధింపులు: అంతేకాదు.. డిసెంబర్ మొదటి నెలలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్, జేఎన్‌యూ ప్రొఫెసర్‌ అర్చనాప్రసాద్‌ తదితరుల మీద సుక్మా జిల్లాలో హత్య కేసు నమోదు చేశారు. నవంబర్ 4వ తేదీన రాష్ట్రంలో హత్యకు గురైన ఒక గిరిజనుడి భార్య ఫిర్యాదు మేరకు ఈ హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బస్తర్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నందినీ సుందర్ ఎంతో కాలంగా హక్కుల విషయాలపై పని చేస్తున్నారు. ఆమె వేసిన పిటిషన్ వల్లనే మావోయిస్టు వ్యతిరేక సాల్వాజుడుంను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కృషికి ప్రతీకారంగా తనను వేధించడానికి తప్పుడు కేసులు పెడుతున్నారని నందినీ ఆరోపించారు. దానికి ముందు సామాజిక కార్యకర్త డాక్టర్‌ బినాయక్‌సేన్‌ను కూడా ఇదే విధంగా వేధించారు.

డిసెంబర్ 19వ తేదీన దంతెవాడ జిల్లాలో సమావేశం నిర్వహించిన ఆదివాసీ హక్కుల కార్యకర్త సుకుల్ ప్రసాద్ బార్సేను కూడా పోలీసులు వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత నెలలో గిరిజన కార్యకర్త, లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సోనీ సోరి.. ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ తీవ్ర బెదిరింపులు ఎదుర్కొన్నారు. అంతకుముందు ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ మాలినీ సుబ్రమణ్యం స్థానిక పోలీసుల వేధింపులు తట్టుకోలేక బస్తర్‌ నుంచి వెళ్లిపోయారు. గత ఏడాది ఒక టీవీ విలేకరి ప్రభాత్సింగ్, మరో పత్రిక విలేకరి దీపక్ జైశ్వాల్లను వివిధ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. మరికొందరు పాత్రికేయులు పోలీసుల కేసులు, వేధింపులకు భయపడి ఆ ప్రాంతాలను విడిచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement