పాస్ చేయకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా
పట్నా: 'సార్ నా వయసు 52. నాకు డాక్టర్ కావాలని ఉంది. నన్ను ఎంబీబీఎస్ పరీక్షల్లో పాస్ చేయండి. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా' అని బిహార్కు చెందిన ఎంబీబీఎస్ ఫైనలియర్ స్టూడెంట్ కపిల్ దేవ్ అధ్యాపకులను బెదిరించాడు. డర్బంగా మెడికల్ కాలేజీ విద్యార్థి కపిల్ దేవ్ 21 ఏళ్లుగా ఎంబీబీఎస్ డిగ్రీ కోసం పాట్లుపడుతున్నాడు. ఫైనలియర్ పరీక్షలు పాస్ అయ్యేందుకు 15 ఏళ్లుగా కసరత్తు చేస్తున్నాడు. అయినా పాస్ కాకపోవడం, ఎంబీబీఎస్ డిగ్రీ చేతికి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.
తనను పాస్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ మెడిసన్ డిపార్ట్మెంట్ హెడ్ బీకే సింగ్కు కపిల్ మెసేజ్ పంపాడు. ఇది సున్నితమైన అంశం కావడంతో కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్కే సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినందుకు అతడిపై కేసు నమోదు చేసే అవకాశముంది. కాగా విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కపిల్ మాట మార్చాడు. మెసేజ్లు పంపిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే.. తాను ఆత్మహత్య చేసుకోనని చెప్పాడు. ఈ ఏడాది ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలు పాస్ కాకుంటే, మళ్లీ పరీక్షలు రాసేందుకు తనను అనుమతించరని చెప్పాడు. 1995లో అతను ఎంబీబీఎస్లో చేరాడు. ఫైనలియర్ పరీక్షలు మినహా ఇతర పరీక్షల్లో పాసయ్యాడు.