ఎయిర్హోస్టెస్లకు ఇక మైసూరు సిల్కు చీరలు!!
మైసూరు సిల్కు చీరలంటే చాలు.. అతివలకు ఎనలేని మోజు. వాటి అందం, హుందాతనం వేరే వేటికీ రాదు. అలాంటి మైసూరు సిల్కు చీరలకు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించనుంది. ఎయిరిండియాలోని ఫ్లైట్ అటెండెంట్లు, ఎయిర్ హోస్టెస్లు ఇక మీదట ఈ చీరలను ధరించబోతున్నారు. ఈ మేరకు మొత్తం 10వేల చీరలను వెంటనే పంపాలని కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఎస్ఐసీ)కి భారీ ఆర్డర్ లభించింది. ఈ మొత్తం చీరల విలువ అక్షరాలా రూ. 6.5 కోట్లు. దీంతో మైసూరు సిల్క్ చీరల ఖ్యాతి ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని సంస్థ ఛైర్మన్ బి.బసవరాజు ఆశిస్తున్నారు. ఇతర అనేక రకాల బ్రాండ్లను కూడా పరిశీలించిన తర్వాత చివరగా అత్యంత నాణ్యమైన మైసూరు సిల్కునే ఎయిరిండియా ఎంచుకుందని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన మైసూరు సిల్కు చీరలకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో చీర ఖరీదు రూ. 12 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటుంది. వివిధ దేశాలకు ఇవి ఎప్పటినుంచో ఎగుమతి అవుతున్నాయి. సినిమా తారలు, మోడళ్లు కూడా తరచు మైసూరు సిల్కు చీరలే ధరిస్తుంటారు. తమకు తరచు రాష్ట్రపతి భవన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయని బసవరాజు తెలిపారు. వివిధ దేశాల నుంచి మన దేశానికి పర్యటనకు వచ్చే వివిధ దేశాధినేతల భార్యలకు కూడా వీటిని బహూకరిస్తుంటారు. ఎలక్ట్రానిక్ జకార్డ్ మిషన్లను ఉపయోగించడం వల్ల చీరల నాణ్యత బాగా పెరిగిందని, ఇలాంటి మరో 10 మిషన్లను రూ. 60 లక్షల ఖర్చుతో ఏర్పాటుచేస్తామని ఆయన వివరించారు.