భారత బాంబులపై ‘రాయ్‌టర్స్‌’ బాంబ్‌  | air strike on Balakot? Satellite images reviewed by Reuters tell a different story | Sakshi
Sakshi News home page

భారత బాంబులపై ‘రాయ్‌టర్స్‌’ బాంబ్‌ 

Published Wed, Mar 6 2019 3:00 PM | Last Updated on Wed, Mar 6 2019 3:53 PM

air strike on Balakot? Satellite images reviewed by Reuters tell a different story  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని జైషే మొహమ్మద్‌ ఉగ్ర స్థావరంపై బాంబుల వర్షం కురిపించిన సంఘటనపై జాతీయంగా, అంతర్జాతీయంగా భిన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో నెట్‌వర్క్‌ కలిగిన ‘రాయటర్స్‌ న్యూస్‌ ఏజెన్సీ’  బుధవారం ఓ బాంబు పేల్చింది. బాలకోట్‌లోని ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళం దాడులు జరిపిన ఆరు రోజుల అనంతరం అంటే, మార్చి 4వ తేదీన శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ‘ప్లానెట్‌ లాబ్స్‌ ఇన్‌కార్పొరేటెడ్‌’  తీసిన బాలకోట్‌లోని జైషే మొహమ్మద్‌ మదర్సా శాటిలైట్‌ చిత్రాలను, అంతకుముందు 2018, ఏప్రిల్‌ నెలలో ఇదే శాటిలైట్‌ తీసిన ఇదే స్థావరం చిత్రాలను విడుదల చేసింది. వాటిని పోల్చి చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చదవండి....(‘బాలకోట్‌’లో భారత్‌ గురి తప్పిందా?!)

బాలకోట్‌లోని భవనాల పైకప్పులపై ఎలాంటి రంధ్రాలుగానీ, కూలిన గోడలుగానీ, కాలిన గుర్తులుగానీ, బాంబులు పడ్డాయని చెప్పడానికి సంబంధించి మరెలాంటి ఆనవాళ్లు  కనిపించడం లేదని స్పష్టం చేసింది. శాటిలైట్‌ పాత చిత్రాలకు, కొత్త చిత్రాలకు ఎలాంటి తేడా కనిపించడం లేదని పేర్కొంది. బాలకోట్‌పై జరిపిన భారత వైమానిక దాడిలో 250 నుంచి 350 వరకు జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులు మరణించారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అందుకు సాక్ష్యాలు చూపించాలంటూ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన జవాన్ల కుటుంబాలు కూడా బాలకోట్‌ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళాలు జరిగిన దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలు చూపించాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి.

అసలేం జరిగి ఉండవచ్చు!
1. ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారు జామున 3.30 గంటల ప్రారంతంలో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు పాక్‌ భాభాగంలోకి దూసుకుపోవడం నూటికి నూరు పాళ్లు నిజం. ఈ విషయాన్ని మనకంటే పాకిస్థాన్‌ వర్గాలే ముందుగా ప్రకటించాయి. సకాలంలో తాము అప్రమత్తమైన భారత యుద్ధ విమానాలను తరమి కొట్టామని, ఆ తొందరలో భారత యుద్ద విమానాలు లక్ష్య రహితంగా బాంబులు కురపిస్తూ పారిపోయాయని, తమవైపు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని పాక్‌ సైనిక వర్గాలు తెలిపాయి. బాలకోట్‌కు పది కిలోమీటర్ల ఇవతల బాంబులు పడ్డాయని, వాటి వల్ల కొన్ని చెట్లు కూలయని, కొన్ని చోట్ల గుంతలు పడ్డాయంటూ కొన్ని ఫొటోలను కూడా పాక్‌ సైనిక వర్గాలు ఆ తర్వాత విడుదల చేశాయి. 

2. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేశారు. బాలకోట్‌లోని జైషే మొహమ్మద్‌ అతిపెద్ద ఉగ్ర శిక్షణ కేంద్రంపై భారత వైమానిక దళాలు బాంబు దాడులు జరిపాయని, ఈ దాడిలో పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు, వారి శిక్షకులు, సీనియర్‌ కమాండర్లు, ఆత్మాహుతి బందాల సభ్యులు మరణించారని చెప్పారు. ఆ తర్వాత ఉగ్రవాదులు మతుల సంఖ్య 350 వరకు ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. 

3. భారత వైమానిక దాడులపై భిన్న కథనాలు వస్తున్న నేపథ్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్టులు బాల్‌కోట్‌ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లారు. వారికి స్థానికులు, పాక్‌ సైనికులు ‘బాంబులు వేసింది ఇక్కడే’ అంటూ కొన్ని బాంబులు పడిన గుర్తులను చూపారు. బాంబు దాడిలో ఓ పౌరుడికి గాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడికి సమీపంలోనే ఉన్న మదర్సా (ఉగ్రవాదుల శిక్షణా కేంద్రం)ను సందర్శించేందుకు మాత్రం పాక్‌ సైనికులు అనుమతించడం లేదు. దాంతో అంతర్జాతీయ మీడియా శాటిలైట్‌ ఛాయా చిత్రాలతో భారత్‌ దాడులు గురి తప్పాయంటూ పలు కథనాలను ప్రచురించాయి. 

బాంబు దాడుల వల్ల ఉగ్రవాదులకు అపార నష్టం వాటిల్లిందని రుజువు చేయడాని భారత వైమానిక దళం వద్ద రాడార్‌ చిత్రాలు, భారత సైన్యం వద్ద శాటిలైట్‌ చిత్రాలు ఉన్నాయంటూ కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోదీ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాన్ని సాగిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణం ఆ రాడార్, శాటిలైట్‌ చిత్రాలను విడుదల చేసి అనుమానాలను పటాపంచలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement