ఎయిర్టెల్ భారీ నజరానా
న్యూఢిల్లీ: తన సంస్థ మహిళా ఉద్యోగులకు మొబైల్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ భారతీ ఎయిర్టెల్ భారీ నజరానా ప్రకటించింది. మహిళా ఉద్యోగులకు ఆ సంస్థ ఇచ్చే ప్రసూతి సెలవులను అమాంతం పెంచేసింది. ఇప్పటి వరకు ఆ సంస్థ మహిళా ఉద్యోగులకు 12 వారాలపాటు ప్రసూతి సెలవులు ఇవ్వగా ప్రస్తుతం 22 వారాలకు పెంచింది. తల్లిగా మారనున్న స్త్రీలపై మానసిక ఒత్తిడి తగ్గించడంతోపాటు వారు మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాధించేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని ప్రకటించింది.
దీంతోపాటు ఇప్పటికే గుర్గావ్ లోని తమ కంపెనీ పిల్లల సురక్షిత బాధ్యతలు కూడా ప్రారంభించిందని పేర్కొంది. ఒక వేళ పిల్లలను దత్తతకు తీసుకుంటే ఆ దత్తత తీసుకునే పిల్లల వయసు రెండేళ్లలోపు ఉంటే ప్రసూతి సెలవులు వర్తిస్తాయని, వారికి పన్నెండు వారాలు ఇవ్వడం జరుగుతుందని, అదే రెండేళ్ల వయసు పైబడిన పిల్లలైతే.. ఆరు వారాల ప్రసూతి సెలవులు లభిస్తాయని చెప్పారు. పురుష ఉద్యోగులకు అయితే వారం రోజులపాటు సెలవులు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా తెలిపింది.