యూపీ ఎన్నికల్లో ముదిరిన ముసలం
లక్నో: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ పై రెబల్స్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఏకంగా ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ టికెట్లు రాని వారికి రెబల్స్‌గా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ జాబితాను ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధుల్లో 325 మంది పేర్లను ములాయం సింగ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ లు బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపిక చేసిన అభ్యర్ధుల్లో అఖిలేశ్ వర్గానికి చెందిన వారికి స్ధానం దక్కలేదు. ఈ నేపథ్యంలో గురువారం అఖిలేశ్ తన అనునాయులతో సమావేశమయ్యారు.
పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక కానీ నాయకులందరూ రెబల్స్ గా బరిలోకి దిగాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో అత్యధికులు ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పని చేస్తున్నవారే. దీంతో 235 మందితో కూడిన జాబితాను గురువారం అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. 171 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 64 మంది కొత్తవారిని రెబల్స్‌గా పోటీచేసే అవకాశం కల్పించారు. కాగా, అఖిలేశ్ యాదవ్ రెబల్స్ జాబితాను ప్రకటించిన నేపథ్యంలో శివపాల్ యాదవ్, ములాయం సింగ్‌తో గురువారం రాత్రి అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అఖిలేశ్ యాదవ్ తీరుపై భేటీలో చర్చించి తదుపరి కార్యచరణను సిద్దం చేయనున్నారు.