లక్నోలో ప్రసంగిస్తున్న ములాయం
లక్నో: ఎస్పీని ఎట్టిపరిస్థితుల్లోనూ చీలిపోనివ్వనని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. బుధవారం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ములాయం అఖిలేశ్‌కు తనకున్నదంతా ఇచ్చేశానని.. అతను పార్టీ వివాదానికి దూరంగా ఉండాలని సూచించారు. పార్టీని చీల్చడానికి రామ్‌గోపాల్ కుట్ర పన్నుతున్నాడని అన్నారు. అంతేకాదు శివ్‌పాల్ యాదవ్ పార్టీకి చేసిన సేవలను గుర్తుచేశారు. ‘మరో పార్టీ అధ్యక్షుడిని మూడుసార్లు ఎవరు కలిశారో నాకు తెలుసు. అతను తన కుమారుడు, కోడల్ని రక్షించుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నన్నే సంప్రదించి ఉంటే.. వాళ్లను రక్షించి ఉండేవాడిని’అని పరోక్షంగా రామ్‌గోపాల్‌ను విమర్శించారు.
సమాజ్‌వాదీ జనతా గుర్తుపై అఖిలేశ్ వర్గం కన్ను..
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్పీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను ఎన్నికల సంఘం పార్టీలోని ఏ వర్గానికీ కేటాయించకపోతే ఏం చేయాలన్నదానిపై అఖిలేశ్ వర్గం కసరత్తు చేస్తోంది. మాజీ ప్రధాని చంద్రశేఖర్ స్ధాపించిన సమాజ్‌వాదీ జనతా పార్టీ గుర్తు ‘చెట్టు’ కోసం యత్నిస్తోంది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ మొరార్కాను అఖిలేశ్ సంప్రదించారని, మొరార్కా సానుకూలంగా ఉన్నారని అఖిలేశ్ వర్గం చెబుతోంది.